– బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేనట్టే
– హైకోర్టు గడువు ఇంకా 50 రోజులే
– తొలుత ఎమ్‌పీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు
– ఆ తర్వాతే గ్రామపంచాయతీలు…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో : తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారమే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్‌రెడ్డి సర్కార్ ముందు అంతకుమించి మరో మార్గం ఏమీ లేనందున, ఇక ఎన్నికలు ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ప్రతిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన విషయం తెలిసిందే. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285(ఏ)లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు దాటరాదనే నిబంధనను తొలగించాలనేది ఈ ఆర్డినెన్స్ సారాంశం. దానితో పాటే అసెంబ్లీలో తీర్మానం చేసిన మరో రెండు బిల్లుల్ని ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అవి కూడా రాష్ట్రపతి వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఆమోదించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మూడురోజులు ఢిల్లీలో ప్రజాప్రతినిధులు ఆందోళనలు చేపట్టారు. అయినా కేంద్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ప్రతిపాదనల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక ఎన్నికలకు వెళ్లడం తప్ప, మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం అనేక చర్చోపచర్చలు జరిపింది. ప్రత్యామ్నాయాలకోసం అన్వేషించింది. బీసీ సంఘాల నేతలతో పాటు, న్యాయకోవిదులనూ సంప్రదించింది. అయినా ప్రత్యామ్నాయం దొరకలేదు. మరోవైపు 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఈ ఏడాది జూన్ 25న తీర్పు వెలువరించింది. ఆ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి, మిగిలిన 60 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలనేది ఆ తీర్పు సారాశం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం వేచిచూడటంతో ఇప్పటికే 40 రోజుల గడువు ముగిసిపోయింది. ఇక ఎన్నికల నిర్వహణకు మిగిలింది కేవలం 50 రోజులు మాత్రమే. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ చేసిన 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఈనెల 13 లేదా 14వ తేదీల్లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై కూడా ఆ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకోనున్నారు.
ఓటర్ల జాబితాలు సిద్ధం
స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు 2019లో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే వీటిని నిర్వహించారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణలు జరిగాయి. వాటి ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజాగా గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత వాటిని వార్డుల వారీగా గ్రామ కార్యదర్శులు ఓటరు జాబితాలను సరిపోల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే వారంలో ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం అవుతుందనీ, వాటిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు 15 రోజులు గడువు ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తమకు స్పష్టత ఇస్తే, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు రాతపూర్వకంగా స్పష్టం చేసింది.
స్థానాలూ ఖరారు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 16న జెడ్‌పీటీసీ, ఎమ్‌పీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలకు ఖరారుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం 31 జెడ్‌పీ స్థానాలను ఖరారు చేశారు. 566 ఎమ్‌పీపీ/జెడ్‌పీటీసీ స్థానాలు, 5,773 ఎమ్‌పీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. అలాగే 12,778 గ్రామపంచాయతీలు, 1.12 లక్షల వార్డుల్ని ఖరారు చేశారు.
పీఆర్ చట్టం-2018 ప్రకారమేస్థానిక ఎన్నికలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES