– ఉత్తుత్తి మంత్రివర్గ ఉపసంఘం
– నెల రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని షరతు…భేెటీ అయితే ఒట్టు
– ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్ర కనీస వేతనాలే దిక్కు
– చిత్తశుద్ధిలేని పాలకులు
– బీఆర్‌ఎస్-కాంగ్రెస్ దొందూదొందే
– కార్మిక శాఖ ఉనికిలో ఉందో లేదో అని డౌట్
”పదేండ్ల తెలంగాణం. పదడుగులు వెనక్కి వేసి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుల బతుకులు ఎక్కడ ఉన్నాయో నేడూ అక్కడే ఉన్నాయి. యాజమాన్యాలకు లాలూచీ పడో…కార్మికులే కదా అన్న చిన్నచూపోగానీ ఖజానాపై పైసా భారం పడకున్నా కార్మికులకు కనీస వేతనాలు పెంచడానికి పాలకులకు మనసొప్పట్లేదు. కనీస వేతనాల జీవోల సవరణ విషయంలో బీఆర్‌ఎస్ పాలకులు పదేండ్లు తాత్సారం చేయగా…కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన కొత్త జీవోలు మేడిపండు చందంగా మారాయి. కనీస వేతనాలపై అధ్యయనం, వేతనాల నిర్ణయం కోసం ముగ్గురు మంత్రులతో వేసిన కమిటీ ముడిపడట్లేదు. నెలరోజుల్లో రిపోర్టు ఇవ్వాలనే సూచన బుట్టదాఖలైంది. రెండు నెలలు కావస్తున్నా ఒక్కసారి కూడా ఆ కమిటీ భేటీ కాలేదంటేనే పాలకులకు కార్మికుల వేతనాల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు”
అచ్చిన ప్రశాంత్
రాష్ట్రంలో 73 షెడ్యూల్ పరిశ్రమల పరిధిలో కోటీ 25 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లకు వేతనాలు పెరగక 14 ఏండ్లు అవుతున్నది. జీవోలు సవరించలేదు. రేవంత్‌రెడ్డి సర్కారు వచ్చాక మినిమం వేజ్ జీవోలను సవరించి కొత్త జీవోలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. జీవోలు కొత్తవైనా వేతనాలు మాత్రం పాతవే. ఇప్పుడు ఇస్తున్న వేతనానికి బేసిక్‌కు పెరిగిన డీఏను కలిపి మొత్తం జీతంగా పరిగణించారు. కొత్త డీఏను యాడ్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోల పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
అన్యాయం జరుగుతున్నదిలా…
1991 లెక్కల ప్రకారం వీడీఏను ప్రామాణికంగా తీసుకుని మార్కెట్ ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను లెక్కించి పెంచుకుంటూ పోతే నేడు కనీస వేతనం రూ.28 వేలకుపైగా ఉండేది. కానీ, 2000 సంవత్సరంలో పాయింట్ వీడీఏ రేటును రూ.13.75 పైసలు నుంచి రూ.10:50 పైసలకు పాలకులు తగ్గించారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీడీఏ రేట్ల స్లాబ్‌లను మార్చేసింది. దీంతో పెరగాల్సిన వేతనాలు కాస్తా క్షీణించాయి. 2009లో కనీస వేతనాల సలహా మండలి కనీస వేతనాలను రూ.12,500 నుంచి 14,500కు సిఫారసు చేసింది. కానీ, ఇప్పటివరకూ దానికి ఆమోదం లభించలేదు. 2017 నుంచి 2021 వరకు అమల్లో ఉన్న కనీస వేతనాల సలహా మండలి సిఫారసు మేరకు ఐదు జీవోలను గత సర్కారు గెజిట్ చేసింది. కానీ, యాజమాన్యాల ఒత్తిడితో నేటికీ వర్తింపజేయడం లేదు.
సలహామండళ్ల సూచనలు గాలికి…
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల తీరుతో కార్మికవర్గం తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ నాలుగు కనీస వేతనాల సలహామండళ్లను ఏర్పాటు చేశారు. 2021 జూన్‌లో ఇచ్చిన ఐదు షెడ్యూల్ పరిశ్రమలకు వేతనాలు పెంచుతూ బీఆర్‌ఎస్ సర్కారు ఫైనల్ చేసింది. వాటి పరిధిలో రాష్ట్రంలో 47 లక్షల మందికి లబ్ది చేకూరబోతున్నదనే సంతోషం కాస్త మొగ్గదశలోనే ఆవిరైంది. ఏమైందో ఏమోగానీ నేటికీ అవి గెజిట్ రూపం దాల్చలేదు. యాజమాన్యాల ఒత్తిడితో అప్పటి సర్కారు వెనకడుగు వేసిందనే విమర్శలొచ్చాయి. దాని ఫలితంగా ఇప్పటిదాకా కార్మికులు నెలకు మూడు వేల కోట్లు నష్టపోతున్నారు. మిగిలిన 68 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రతి నెలా 6 వేల కోట్లు నష్టపోతున్నారు. పాలకులు ఇలా చేయడమంటే శ్రమ దోపిడీని ప్రోత్సహిస్తూ పారిశ్రామిక వేత్తలకు వత్తాసు పలుకడమే అవుతుంది.
మంత్రి వర్గ ఉపసంఘమైనా తేల్చేనా?
రాష్ట్రంలో మెరుగైన కనీస వేతనం నిర్ణయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామిలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి చైర్మెన్‌గా మల్లు భట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన జీవో 848ని రాష్ట్ర సర్కారు ఈ ఏడాది జూన్ 27న విడుదల చేసింది. నెలరోజుల్లోనే అధ్యయన రిపోర్టు ఇవ్వాలని స్పష్టం చేసింది. కానీ, ఆ కమిటీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. కనీస వేతనాలు ఎంత ఉండాలనే దాన్ని తేల్చలేదు.
చట్టానికి తూట్లు : పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కనీస వేతనాల చట్టానికి తూట్లు పొడిచి అన్యాయం చేస్తారా? ఇదెక్కడి అన్యాయం. కనీస జీవోలను సవరిస్తామని ఎన్నికల హామీలో కాంగ్రెస్ నేతలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచలేదుగానీ కొత్తజీవోలిచ్చారు. ఇది సరిగాదు. కనీస వేతనాల సలహామండలి బోర్డు అధికారాలను హరించేందుకు సబ్ కమిటీ వేశారనే చర్చా నడుస్తున్నది. కనీస వేతనాల బోర్డులో గుర్తింపు పొందిన కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని విడనాడి కనీస వేతనాల సలహా మండలి సిఫారసుల మేరకు మొత్తం 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కోటీ 20 లక్షల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచాలి. కనీస వేతనాల పెంపు కోసం కార్మికులంతా పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిస్తున్నాం.
సుప్రీం కోర్టు తీర్పు బుట్టదాఖలు
వివిధ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా వేతనాలు నిర్ణయించడం, కార్మికులపై యాజమాన్యాల శ్రమదోపిడీ నిరోధించడమే లక్ష్యంగా కనీస వేతన చట్టం 1948 వచ్చింది. కనీస వేతనాలు నిర్ణయించడంలో ఆక్ట్రారు సిఫారసులు, సుప్రీం కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి. కుటుంబ అవసరాల ప్రాతిపదికన కనీస వేతనం నిర్ణయించాలని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్-1957 సిఫారసు చేసింది. దాని ప్రకారం భార్యాభర్తలిద్దరూ రెండు యూనిట్లు, ఇద్దరు పిల్లలు ఒక యూనిట్‌గా మొత్తం మూడు వినిమయ యూనిట్లుగా కనీస వేతనాన్ని నిర్ణయించాలి. రోజుకు ఒక వ్యక్తి కనీసం 2700 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం ఖర్చు, సంవత్సరానికి 72 గజాల బట్ట, ఇంటి కిరాయి, ఇతరత్రా ఖర్చులకు కొంత, దానికి అదనంగా మరో 25 శాతం కలిపి
కనీస వేతనంగా నిర్ణయించాలని 1992లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కనీస వేతనం రూ.18 వేలు ఉండాలని ఏడవ పే కమిషన్ తేల్చిచెప్పింది. పై లెక్కల ప్రకారం చూస్తే 2024 నాటికి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో లెక్కిస్తే కనీస వేతనం రూ.27,540 ఉండాలి. పాలకులు ఈ ప్రతిపాదనల్లో వేటినీ అమలు చేయడం లేదు. ఫలితంగా రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేసినా మెజారిటీ కార్మికులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపే వేతనం దక్కుతున్నది.
కనీస వేతనం కానరాదేం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES