Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంరింగ్‌లోనే యువ బాక్సర్లు మృతి

రింగ్‌లోనే యువ బాక్సర్లు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: సాహసం, పోరాటానికి మారుపేరుగా నిలిచే బాక్సింగ్‌ రింగ్‌.. జపాన్‌లో విషాదాన్ని మిగిల్చింది. ఒకే ఈవెంట్‌లో జరిగిన రెండు వేర్వేరు మ్యాచ్‌లలో ఇద్దరు బాక్సర్లు మరణించడం బాక్సింగ్‌ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. టోక్యోలోని కొరాకుఎన్‌ హాల్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో, తీవ్రమైన తలగాయాల కారణంగా ఇద్దరు యువ బాక్సర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్‌ సంఘాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. టోక్యోలోని కొరాకుఎన్‌ హాల్‌లో ఆగస్టు 2న జరిగిన బాక్సింగ్‌ ఈవెంట్‌ బాక్సింగ్‌ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలింది. ఈ ఈవెంట్‌లో జరిగిన రెండు వేర్వేరు మ్యాచ్‌లలో 28 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాక్సర్లు తలకు తీవ్ర గాయాలై మరణించారు. ఈ దుర్ఘటనతో బాక్సింగ్‌లో భద్రత ప్రమాణాలపై తీవ్ర చర్చ మొదలైంది.

రింగ్‌లోనే కుప్పకూలిన షిగెటోషి కొటారి..
ఓరియెంటల్‌ అండ్‌ పసిఫిక్‌ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ జూనియర్‌ లైట్‌వెయిట్‌ ఛాంపియన్షిప్‌ కోసం యమటో హాటాతో జరిగిన 12 రౌండ్ల మ్యాచ్‌లో షిగెటోషి కొటారి పాల్గన్నారు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసిన వెంటనే, కొటారి అస్వస్థతకు గురై రింగ్‌లోనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించి బ్రెయిన్‌ సర్జరీ చేసినప్పటికీ, శుక్రవారం (ఆగస్టు 8న) ఆయన తుది శ్వాస విడిచారు. కొటారి మెదడు, పుర్రె మధ్య రక్తం గడ్డకట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

హిరోమాసా ఉరకావా తలకు తీవ్రగాయం…
ఆగస్టు 2న అదే ఈవెంట్‌లో యోజి సైటోతో జరిగిన మ్యాచ్‌లో 28 ఏళ్ల హిరోమాసా ఉరకావా పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో ఉరకావా తలకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో నాకౌట్‌ అయ్యారు. ఆ వెంటనే అతనికి మెదడుకు సర్జరీ చేసినప్పటికీ, శనివారం (ఆగస్టు 9న) ఆయన కూడా మరణించారు.

బాక్సింగ్‌ సంఘాల స్పందన
ఈ రెండు యువ బాక్సర్ల మరణాలపై ప్రపంచ బాక్సింగ్‌ సంస్థ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కొటారి మరణంపై ”బాక్సింగ్‌ ప్రపంచం ఈ విషాదకరమైన మరణాన్ని చూసి విలపిస్తోంది. అతను రింగ్‌లో ఒక యోధుడు. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. వారి కుటుంబాలకు, జపాన్‌ బాక్సింగ్‌ కమ్యూనిటీకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం” అని ఒక పోస్ట్‌లో తెలిపింది. ఉరకావా మరణం తర్వాత మరో పోస్ట్‌లో.. ”ఈ హఅదయం బద్దలయ్యే వార్త కొటారి మరణం తర్వాత ఒక రోజులోనే వచ్చింది. ఈ కష్టకాలంలో వారి కుటుంబాలకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం” అని పేర్కొంది.

కొత్త భద్రతా నిబంధనలు…
ఈ దుర్ఘటనల నేపథ్యంలో జపాన్‌ బాక్సింగ్‌ కమిషన్‌ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఓరియెంటల్‌ అండ్‌ పసిఫిక్‌ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ టైటిల్‌ బౌట్‌ల రౌండ్లను 12 నుంచి 10కి తగ్గించాలని నిర్ణయించింది. బాక్సింగ్‌ క్రీడలో సేఫ్టీ స్టాండర్ట్స్‌ పెంచాలని నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img