ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఖాప్ పంచాయతీలు నడుస్తున్నాయి. అంతేకాదు కులం, లింగం, నైతికత అంటూ అనేక నిబంధనలు పెడుతూ బాలికలను నిర్దేశిస్తూ ఉంటారు. అలాంటి చోట కౌమార బాలికలు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. బాల్యవివాహాలు, ఋతు హక్కులు, ఆస్తి హక్కులపై మాట్లాడుతున్నారు. మహిళలను కించపరిచే భాషకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు నేటి మానవిలో…
ఐదేండ్ల కిందట మోనికా స్వామికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేయడానికి అనుమతి లేదు. గ్రామీణ రోహ్‌తక్‌లోని చాలా మందిలాగే ఆమె కుటుంబం కూడా సోషల్ మీడియా అమ్మాయిలను భ్రష్టుపట్టిస్తుందని, ప్రేమలో పడేలా ప్రేరేపిస్తుందని నమ్మింది. నేడు 26 ఏండ్ల ఆమె ఇలాంటి అపోహలను ఛేదించింది. సోషల్ మీడియా నుండి సర్పంచ్ కార్యాలయం వరకు ఎదిగింది. అంతేకాదు హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో గ్రామ పాలనను పునర్నిర్మించే మహిళల నేతృత్వంలోని సమిష్టి లాడో పంచాయితీలో ఐదేండ్ల పాటు శిక్షణ ఇచ్చింది. పురుషాధిక్య తీర్పులు, ఖాప్ పంచాయితీలు ఆధిపత్యం చెలాయిస్తుంటే లాడో పంచాయతీని మాత్రం మహిళలు నిర్ణయం తీసుకునే కేంద్రంగా మార్చింది.
ప్రత్యామ్నాయ పంచాయితీలు
లాడో పంచాయితీలో చేరినప్పటి నుండి ఆమె పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించింది. కర్నాల్ బ్లాక్ డెవలప్‌మెంట్, పంచాయితీ అధికారిణిగా కూడా పని చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పని చేసింది. బాలికలకు రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన కల్పించింది. ఏ సర్పంచ్ భర్త తన కార్యాలయంలో అధికారిక కుర్చీని ఆక్రమించకుండా చూసుకుంది. ఆమె ప్రారంభించిన ఈ ఉద్యమం నేడు హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ అంతటా వేలాది మంది బాలికలను సమీకరించింది. గ్రామీణ, అణగారిన వర్గాలకు చెందిన 15-30 ఏండ్ల వయసు గల బాలికలు, ప్రత్యామ్నాయ పంచాయతీల నమూనాలో గ్రామ సమావేశాలను నిర్వహిస్తారు. వారి ఆందోళనలను వినిపించే, సామాజిక సమస్యలను చర్చించే, తీర్మానాలను ఆమోదించే వేదికలు ఇవి. ప్రతి సెషన్ ఒక అమ్మాయిని ప్రధాన్ లేదా అధిపతిగా ఎంపిక చేసుకోవడంతో ఇది ప్రారంభమవుతుంది. ఆమె తలపాగా ధరించి చర్చ మొదలుపెడుతుంది. ఇది సాంప్రదాయ పితృస్వామ్యాన్ని గర్వంగా తారుమారు చేసే నమూనాగా చెప్పుకోవచ్చు.
కళంకాలకు ప్రతిఘటనగా…
బాల్య వివాహం, కుల, లింగ వివక్ష, ఋతు ఆరోగ్యం, విద్యా అవకాశాలు, ఆస్తి హక్కు వంటి విషయాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. వీటిపై స్థానిక, రాష్ట్ర అధికారులకు వినతి పత్రాలు తయారు చేసి సమావేశం ముగుస్తారు. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లను పుట్టనివ్వడం లేదు. ఒకవేళ అమ్మాయిలు ఉంటే వారిని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు. మగపిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతారు. అబ్బాయిల బలమైన ఆహారాన్ని తినిపించి మిగిలితే అప్పుడు అమ్మాయికి పెడతారు. దీనికి వ్యతిరేకంగా మోనికా ఎంతో కృషి చేస్తుంది. దేశంలో బాలికల పుట్టుక చుట్టూ ఉన్న కళంకానికి ప్రతిఘటనగా 2015లో ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది ఒక సాధారణ పిలుపుతో ప్రారంభమైంది. తండ్రులు తమ కుమార్తెలతో సెల్ఫీలు పోస్ట్ చేసి, వారిని బహిరంగంగా పెట్టాలని ప్రోత్సహించారు. ఈ ప్రచారం త్వరగా కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. మహిళల పట్ల సమాజ వైఖరులను మార్చడానికి, స్త్రీ భ్రూణహత్య, బాలికల విద్య, సమాన హక్కుల గురించి చర్చను రేకెత్తించడానికి ప్రయత్నించింది.
అసాధ్యాన్ని సాధిస్తున్నారు
శివాలికా పాండే 2021లో హర్యానాలోని హిసార్‌లో జరిగిన లాడో పంచాయతీ సెషన్‌కు హాజరైనప్పుడు ఢిల్లీలో న్యాయ విద్యార్థిని. అక్కడ బాలికలకు త్వరగా వివాహం జరిగే విధానాన్ని, ఋతుస్రావం చుట్టూ ఉన్న కళంకంపై, వారి శరీరాలపై అవగాహన కల్పించింది. కాలేజీ తర్వాత వెంటనే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినప్పుడు ఆమెలో ఈ ఆలోచన మొదలయ్యింది. నేడు లాడో పంచాయతీ బాలికలు ఒకప్పుడు అసాధ్యం అని భావించిన మార్పులను నేడు కొనసాగిస్తున్నారు. బాలికలు బహిరంగంగా మహిళలను అవమానించే భాషను అరికట్టడానికి కఠినమైన చట్టాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తల్లులు, సోదరీమణులపై అవమానకరమైన దూషణలను ఉపయోగించడంపై వారు కృషి చేశారు. ఇటువంటి భాష అశ్లీలతను, సామాజిక దుష్ప్రవర్తనను పెంపొందిస్తుందని, మహిళలు, సమాజ విలువలను తీవ్రంగా అగౌరవపరుస్తుందని వారు నొక్కి చెప్పారు. శారీరక హింసను మాత్రమే కాకుండా దుర్వినియోగ ప్రసంగాన్ని కూడా శిక్షించడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలికల సంఘం అధ్యక్షురాలు ఖుష్బూ పవార్ కోరారు.
నమ్మకం పెరిగింది
ఒకప్పుడు ఋతుస్రావం గురించి మాట్లాడటం కూడా నిషిద్ధమైన బీబీపూర్‌లో ఇప్పుడు దాదాపు ప్రతి గదిలోనూ క్యాలెండర్‌ల పక్కన, దేవతల చిత్రాల పక్కన ఒక ఋతు పటం కనిపిస్తుంది. అమ్మాయిలు తమ చక్రాలను బహిరంగంగా ట్రాక్ చేస్తున్నారు. వారి కుటుంబాలు కూడా ఋతుస్రావాన్ని వారి జీవితంలో సహజ భాగంగా పరిగణించడం నేర్చుకుంటున్నారు. కాస్త ఇబ్బంది పడ్డా ఆచరిస్తున్నారు. జగ్లాన్ అనే సామాజిక కార్యకర్త ప్రకారం ఈ ఉద్యమం వల్ల అమ్మాయిలో వారిపై వారికి నమ్మకం పెరిగింది. కొందరు తమ ఇళ్లలో, సమాజాలలో హింసను ఎదుర్కొన్నారు, ఆన్‌లైన్‌లో వేధింపులను ఎదుర్కొన్నారు. ఇలాంటి అమ్మాయిలు ఎప్పుడైనా మా మద్దకు కోసం రావచ్చు. ఇంటా బయట తమ కోసం, ఇతరుల కోసం మాట్లాడేంత బలంగా ఉండే విధంగా మేము వారిని మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా మద్దతు ఇస్తాము’ అంటున్నారు.
బాలికలు నడిపే పంచాయితీలు
- Advertisement -
- Advertisement -