ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న కార్మికుల సమ్మె పరిస్థితుల నేపథ్యంలో పలువురు చిన్న నిర్మాతలు చిత్ర నిర్మాణంలో ఫెడరేషన్ వల్ల తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రెస్‌మీట్ ద్వారా తెలియజేశారు.
సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు ఎస్‌కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్ షో చైతన్య, ఛారు బిస్కట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ వర్రె తదితరులు పాల్గొన్నారు.
ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది?
చిన్న నిర్మాతలు బాగుంటేనే ఇండిస్టీ బాగుంటుంది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న మాలాంటి నిర్మాతలను 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె మరింత ఇబ్బంది పెడుతోంది. మా సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఇప్పుడు సమ్మె వల్ల షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. పేపర్ మీద లెెక్క చూస్తే 150 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ సెట్‌లో 50 మంది కూడా ఉండరు. వాళ్లకు ఇస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తోంది?. ఓటీటీ, డబ్బింగ్ సినిమాలకు డబ్బులు ఏవీ టైంకు రావట్లేదు. కానీ, మేం మాత్రం ఏ రోజుకి ఆ రోజు కార్మికులకు డబ్బులివ్వాలంటే అయ్యే పనేనా?.
– నిర్మాత రాజేశ్ దండా
ఇంత మందిని మా నెత్తిన రుద్దడం ఏంటి?
ఒక చిన్న సీన్ చేయాలనుకుని జనరేటర్ పెట్టాలన్నా యూనియన్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక చిన్న గదిలో హీరో, ఫ్రెండ్ సీన్ కోసం మేకప్, కాస్ట్యూమ్స్, వాళ్లకు వడ్డించే ప్రొడక్షన్..ఇలా 80 మందిని పెట్టుకోవాలి. చిన్న నిర్మాతకు ఇంత మందిని పెట్టుకోవడం పెనుభారం. అదేంటి ఇంత మంది ఎందుకు పెట్టు కోవాలని అడిగితే, ఫెడరేషన్ రూల్స్ అని చెబుతున్నారు. వాస్తవానికి అక్కడ పని చేసేది ఆరుగురు మాత్రమే. మిగతా వాళ్లకూ పేమెంట్స్ ఇవ్వాలి. ఇంత మందిని మా నెత్తిన రుద్దడం ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది.
– నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి
వాళ్ళు చెప్పిన వాళ్ళనే పెట్టుకోవాలి
సినీ నిర్మాతల పరిస్థితి దయనీయంగా ఉంది. మన దగ్గరే కాదు దేశ విదేశాల్లోనూ ఫిలిం మేకింగ్ ఇబ్బందుల్లో ఉంది. సినిమానే కాదు ఐటీ, రియల్ ఎస్టేట్ సహా ప్రతి ఇండిస్టీ స్లంప్‌లో ఉంది. రేపు బాగుంటుందనే అందరూ పని చేస్తున్నారు. అయితే ఫెడరేషన్ వాళ్ళు మేము చెప్పిన వాళ్లనే పెట్టుకోండి, ఇంత మందిని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనడం కరెక్ట్ కాదు. నిర్మాతలు ఎంప్లారు మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఏ నిర్మాత కూడా సంతోషంగా లేడు.
– నిర్మాత ప్రైమ్ షో చైతన్య
చిన్న నిర్మాతల స్థానంలో ఉండి ఆలోచించండి
చిత్ర నిర్మాణం భారంగా మారుతోంది. రెండు కోట్ల రూపాయల్లో చేయాల్సిన సినిమాకు నాలుగైదు రెట్ల ఖర్చు అవుతోంది. మా దగ్గరకు రిలీజ్ చేయమని వచ్చే సినిమాలు చూస్తే రూ.2 కోట్లలో చేయాల్సినవి అనిపిస్తాయి. కానీ వాళ్లు నాలుగైదు రెట్లు ఎక్కువ అయ్యిందని చెబుతారు. థియేటర్స్ నుంచి అంత డబ్బులు రావడం లేదు. ఇంత ప్రొడక్షన్ ఖర్చు ఎందుకు అవుతోందని సినీ కార్మిక సంఘాలు ఒకసారి నిర్మాత స్థానంలోకి వచ్చి ఆలోచిస్తే మా బాధలు తెలుస్తాయి.
– నిర్మాత వంశీ నందిపాటి
యూనియన్ల పేరుతో భారాన్ని పెంచకండి
మేమంతా ఇండిస్టీకి ప్యాషన్‌తో వచ్చాం. సినిమాలు చేస్తున్నాం. యూనియన్ల పేరుతో మాకు భారాన్ని పెంచవద్దని కోరుతున్నాం. తక్కువ మందితో సరి పోయే చిత్రీకరణలో 100, 150 మందిని పెట్టాలని దౌర్జన్యం చేస్తున్నారు. మంచి క్వాలిటీ కోసం పెట్టాల్సిన డబ్బు అంతా ఇలా వథా అవుతోంది. ఈ సమ్మె వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.
– నిర్మాత ధీరజ్ మొగిలినేని
వాళ్ళతో చేస్తే బడ్జెట్ చాలా పెరుగుతుంది
నేేను గతంలో ఒక సినిమాను లోకల్ టాలెంట్, యూనియన్ కార్మికులను కలిపి చేస్తే రూ. కోటిన్నర అయ్యింది. ఇప్పుడు మొత్తం యూనియన్ కార్మికులతో చేస్తే 8 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. చిన్న సినిమాకు అసలు బిజినెస్ లేదు. అలాంటి టైమ్‌లో నాకు 8 కోట్ల బిజినెస్ ఎలా అవుతుంది?. నేను నష్టపోతే ఆదుకునేందుకు ఎవరొస్తారు? – నిర్మాత రాకేశ్ వర్రె
యూనియన్ల రూల్స్ ఇబ్బంది పెడుతున్నాయి
మేము కొత్తవాళ్లతో సినిమాలు చేస్తున్నాం. యూనియన్ల రూల్స్ వల్ల మాలాంటి చిన్న నిర్మాతలకు ఇబ్బందిగా ఉంది. నిర్మాతలు, యూనియన్స్ అని సెపరేట్ కాకుండా అందరూ కూర్చుని మాట్లాడుకుంటే ఈ సమస్యలు సాల్వ్ అవుతాయని భావిస్తున్నా. – ప్రొడ్యూసర్ ఛాయ్ బిస్కెట్ శరత్
బాధ్యతని మర్చిపోతే ఎలా?
ఇండిస్టీలో 90 శాతం సినిమాలు చిన్న నిర్మాతలవే. చిన్న సినిమాలకు 25 శాతం వేతనాలు తగ్గించండి అని ఫెడరేషన్‌తో ఒప్పందం చేసుకుంటే, దాన్ని వాళ్లు పాటించడం లేదు. ఏ సినిమాకైనా అదే కష్టం అంటూ పెద్ద సినిమాలతో సమానంగా వేతనాలు తీసుకుంటున్నారు. చిత్రీకరణకు ఇంతమందిని తీసు కోవాలి, ఇంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసే హక్కు మీకెక్కడిది?, అసలు బిజినెస్ లేదని మేము బాధపడుతుంటే 30 శాతం పెంచాలని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్. మీరు డిమాండ్స్ మాత్రమే చేసి, బాధ్యతని మర్చిపోతే ఎలా?, మీరు మారకుంటే మా బడ్జెట్‌లో వచ్చేవాళ్లతో సినిమాలు నిర్మించుకుంటాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మాలాంటి చిన్న నిర్మాతలు పడుతున్న ఇబ్బందులపై దష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– నిర్మాత ఎస్‌కేఎన్