Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఆటలుకప్పు కొడతాం!

కప్పు కొడతాం!

- Advertisement -

– మహిళల వరల్డ్‌కప్‌పై హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
– ముంబయిలో 50 రోజుల కౌంట్‌డౌన్‌ ఈవెంట్‌

మహిళల క్రికెట్‌లో భారత్‌ అగ్రజట్టుగా ఎదుగుతున్నా.. ఐసీసీ ప్రపంచకప్‌ లోటు సుస్పష్టం. 2005, 2017 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరినా.. మిథాలీసేన రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2022 వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరుకోని టీమ్‌ ఇండియా.. ఇప్పుడు 2025లో స్వదేశంలో ఐసీసీ టైటిల్‌పై కన్నేసింది. భారత మహిళల జట్టు ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉందని, డ్రెస్సింగ్‌రూమ్‌ ఆలోచనలు గెలుపు చుట్టూనే ఉంటున్నాయని… ఖాయంగా కప్పు కొడతామని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.
నవతెలంగాణ-ముంబయి
ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియా గొప్పగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 వన్డేల్లో తొమ్మిది విజయాలు సాధించింది. ఐర్లాండ్‌పై 3-0 క్లీన్‌స్వీప్‌, ముక్కోణపు వన్డే సిరీస్‌ (శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత్‌) విజయం సహా తాజాగా ఇంగ్లాండ్‌ గడ్డపై 2-1తో సిరీస్‌ సొంతం. విజయాలను అలవాటుగా మార్చుకున్న టీమ్‌ ఇండియా అమ్మాయిలు ఈ ఏడాది స్వదేశంలో జరుగనున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌పై కన్నేశారు. ఐసీసీ వరల్డ్‌కప్‌ వేటలో అడ్డుగోడలను బద్దలుకొట్టి.. కప్పు కొడతామని భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌ స్మృతీ మంధాన నమ్మకంగా ఉన్నారు. సెప్టెంబర్‌ 30 నుంచి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభం కానుండగా.. సోమవారం ముంబయిలో ఐసీసీ 50 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమం నిర్వహించింది. ఐసీసీ చైర్మెన్‌ జై షా, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ సైకియా సహా క్రికెట్‌ దిగ్గజాలు మిథాలీరాజ్‌, యువరాజ్‌ సింగ్‌ సహా భారత మహిళా క్రికెటర్లు స్మృతీ మంధాన, జెమీమా రొడ్రిగస్‌లు వరల్డ్‌కప్‌ కౌంట్‌డౌన్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ఇదే సరైన సమయం :
‘సొంత అభిమానుల నడుమ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. భారతీయులు, మేము ఎదురుచూస్తున్న కప్పు కొట్టేందుకు ఇదే సరైన సమయం. ఈసారి టైటిల్‌ వేటలో అడ్డుగోడలను బద్దలుకొట్టేందుకు వంద శాతం కష్టపడతామని’ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. స్వదేశంలో ప్రపంచకప్‌ వేటకు సిద్ధం కావటం ముంగిట అమ్మాయిలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. గత రెండేండ్లుగా విలువైన క్రికెట్‌ ఆడాం. అది మాలో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగించింది. ఈ ఏడాది మా గెలుపు జోరును ఇలానే కొనసాగించాలని అనుకుంటున్నాం. భారత జట్టులో ఇటీవల వచ్చిన అతిపెద్ద మార్పు.. మా ఆలోచనలు, భయమెరుగని క్రికెట్‌ ఆడటమే. ఇంగ్లాండ్‌లో ఫలితాల పట్ల మాకేమీ ఆశ్చర్యం కలుగలేదు. ఎందుకంటే ఇంగ్లీశ్‌ సిరీస్‌ కోసం మా ఆ స్థాయిలో చెమటోడ్చాం. మేము ఎంతో కష్టపడుతున్నాం, మేము సాధించగలమనే నమ్మకం కలిగింది. డ్రెస్సింగ్‌రూమ్‌ ఆలోచనలు ఎలా గెలవాలి, ఇంకా మెరుగయ్యేందుకు ఏం చేయాలనే సాగుతుంది. మేమేదో గొప్పగా చేశామని మా భావన కాదు.. కానీ ఇదే జోరు మళ్లీ మళ్లీ చూపించాలని అనుకుంటున్నామని హర్మన్‌ప్రీత్‌ వెల్లడించింది.
‘ఆస్ట్రేలియాతో ఎప్పుడు తలపడినా.. ఎల్లప్పుడూ కఠిన సవాల్‌గానే ఉంటుంది. మన ఎక్కడ ఉన్నామనే విషయం, ఏ విభాగాల్లో మెరుగవ్వాలనే విషయం ఆసీస్‌తో పోటీపడినప్పుడు తెలుస్తుంది. వరల్డ్‌కప్‌ ముంగిట స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ మాకు ఎంతో స్పష్టత ఇవ్వనుంది. ఆసీస్‌తో సిరీస్‌లో మంచిగా ఆడటంతో పాటు.. అదే జోరు వరల్డ్‌కప్‌లో కొనసాగించాలని మా వ్యూహం. ఇటీవల ఆసీస్‌తో పాటు అన్ని జట్లు ఉత్తమంగా రాణిస్తున్నాయి. టాప్‌-4లో ఏ నాలుగు జట్లు నిలుస్తాయో చెప్పటం కష్టమే. ఇది ఎంతో మంచి పరిణామం. ఎందుకంటే గతంలో ఓ జట్టు (ఆసీస్‌) కచ్చితంగా ఫైనల్‌కు చేరుతామనే నమ్మకంతో టోర్నమెంట్‌ను ఆరంభించేది. ఇప్పుడు సెమీఫైనల్‌ బెర్త్‌ రేసులో అన్ని జట్లూ ఉన్నాయి. ఆ రోజు మంచి క్రికెట్‌ ఆడి, ఉత్తమ ప్రదర్శన చేసిన జట్టునే విజయం వరిస్తుందని’ అని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img