– కలెక్టరేట్ మెట్లెక్కిన తల్లి
– కూతుళ్లతో వచ్చిన వృద్ధురాలు
– కొడుకుపై చర్యకు కలెక్టర్ ఆదేశం
నవతెలంగాణ- నారాయణపేట
కన్న కొడుకు తనను పట్టించుకోవడం లేదంటూ ఓ తల్లి న్యాయం కోసం కలెక్టరేట్ మెట్లెక్కింది. నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి వచ్చిన ఆ తల్లి.. దీనస్థితిపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ తక్షణం స్పందించారు. తల్లి బాగోగులు చూడని కొడుకుపై చర్య తీసుకోవాలని ఆర్టీవోను ఆదేశించారు. నారాయణ పేట పట్టణానికి చెందిన రుక్మిణి అనే వృద్ధురాలు.. నడవలేని స్థితిలో తన ఇద్దరు కూతుర్ల సాయంతో కలెక్టరేట్‌కు వచ్చింది. ఆమె మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుండటంతో అప్పుడే వచ్చిన కలెక్టర్.. తన వాహనం దిగి రుక్మిణి వద్దకు వెళ్ళి ఆమె సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. తన కొడుకు, కోడలు తనను చూసుకోవడం లేదని, చనిపోయిన తన భర్త ఉద్యోగం పొందిన కొడుకు తనకు తిండి పెట్టడం లేదని, కోడలు సైతం సూటి పోటీ మాటలు అంటుందని, నడవలేని (షుగర్, నడుం సంబంధిత వ్యాధి వల్ల) తనను ఇక్కడే అత్తగారింట్లో ఉంటున్న తన పెద్ద కూతురు వద్ద తన కొడుకు వదిలి వెళ్ళాడని, ఎలాగైనా తనకు న్యాయం చేసి ఆదుకోవాలని రుక్మిణి కలెక్టర్‌తో మొర పెట్టుకుంది. వెంటనే స్పందించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్.. వృద్ధురాలి కోసం వీల్ చైర్ తెప్పించి తక్షణ రక్షణ కోసం పట్టణంలోని సఖీ కేంద్రంలో చేర్పించారు. అలాగే, రుక్మిణి కొడుకుపై తగిన చర్యలు తీసుకునేందుకు ఆర్డీఓ రామచందర్‌ను విచారణకు ఆదేశించారు.
కొడుకు పట్టించుకోవడంలేదని …
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES