వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్న ప్రజా ప్రభుత్వం : మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క
నవతెలంగాణ- ములుగు
పామాయిల్ పంటను సాగు చేస్తున్న రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఇంచర్ల గ్రామపంచాయతీ శివారులోని 12 ఎకరాల్లో కేఎన్ బయోసైన్స్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీకి మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆయిల్ ఫెడ్ చైర్మెన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాషా, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ములుగు జిల్లా ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఇటీవల వెలుగులోకి వచ్చిన కర్రెగుట్టల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నదని తెలిపారు. ములుగు జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క ఏది అడిగినా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు పోతున్నదని తెలిపారు. రైతులు తమకున్న భూముల్లో కొంత భాగాన్ని పామాయిల్ మొక్కల పెంపకానికి కేటాయించాలని, మొక్క నాటిన మూడేండ్ల తర్వాత రైతుల ఇండ్లలో సిరులు కురిపిస్తుందని అన్నారు. జిల్లాలో కనీసం పదివేల ఎకరాల్లో పామాయిల్ మొక్కలు పెంచడానికి జిల్లా యంత్రాంగం రైతులకు అవగాహనా సదస్సులు నిర్వహించాలని సూచించారు. పామాయిల్ గింజలను పండిస్తున్న రైతులకు ప్రస్తుతం టన్నుకు రూ.18,052 ఉండగా, రైతులకు గిట్టుబాటు కలిగేలా రూ.25 వేలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీ పనులను రానున్న ఉగాది లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ… జిల్లాలోని రైతులు గతంలో వరి, పత్తి పంట సాగు చేయడానికే ఆసక్తి చూపించేవారని, ప్రస్తుతం పామాయిల్ పంట సాగు చేయడానికి ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు.
ఒకసారి పంట పూర్తయ్యాక కంపెనీలే ఆ పంటను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయడానికి శాశ్వత భవనాలను నిర్మిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్‌రావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ చైర్మెన్ బానోతు రవి చందర్, హార్టికల్చర్ అధికారి సంజీవరావు, కేఎన్ బయోసైన్స్ కంపెనీ ఎండీ సుధారెడ్డి, జిల్లా, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమే రామ రాజ్యమా?
– ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయట పెట్టాలి : బీజేపీపై మండిపడిన మంత్రి సీతక్క
రామ రాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా.. అని మంత్రి సీతక్క బీజేపీని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. సోమవారం ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రజా తీర్పును దొంగిలించి బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆధారాలతో సహా బయటపెడితే బీజేపీ తట్టుకోలేక పోతుందని అన్నారు. అణచివేతలను ఆయుధంగా ఎంచుకుని అరెస్టులు చేయిస్తోందన్నారు. హర్యానా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని, ప్రజా తీర్పు అదే విధంగా ఉందన్నారు. కానీ, దొంగ ఓట్లతో ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందని ఆరోపించారు. లక్షల సంఖ్యలో దొంగ ఓట్లను నమోదు చేసి అక్రమ పద్దతుల్లో గెలుస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ తప్పులను రాహుల్ గాంధీ నిలదీస్తుంటే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను బీజేపీ జేబు సంస్థలుగా మార్చుకున్నదని, ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ను సైతం తన అధికారం కోసం వాడుకుంటోందని అన్నారు. బీజేపీ వారు నిజంగా రామ భక్తులైతే… ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయట పెట్టాలని, అప్పుడు దొంగ ఓట్లు ఎన్ని, అసలు ఓట్లు ఎన్నో తేలిపోతుందని అన్నారు. కానీ, బీజేపీ ఆ పని చేయదని, దొడ్డి దారిన దొంగ ఓట్లతో మూడుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చిందని రాహుల్‌గాంధీ నిరూపించారని అన్నారు. ఓటు అనేది రాజ్యంగం కల్పించిన బలమైన ఆయుధం అని, ఆ ఆయుదాన్ని కూడా దొంగిలించి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గ నిర్ణయాలను గడపగడపకు తీసుకెళ్లి ఎండగడతామని, బీజేపీని గ్రామాల్లోకి రానివ్వకుండా ప్రజలే అడ్డుకుంటారని అన్నారు.