– పన్ను భారం మోపకుండా.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు
– విద్యుత్ ఉద్యోగులకూ రూ.కోటి బీమా : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
– మొయినాబాద్ మండలంలో సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన
నవతెలంగాణ – మొయినాబాద్
గ్రీన్ పవర్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ఎంత ఉన్నా.. నాణ్యతతో ఎలాంటి సమస్యలు లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ముర్తుజగూడ గ్రామ సమీపంలో చిలుకూరు, నాగిరెడ్డిగూడ, నవాబ్‌పేట మండలంలోని నారేగూడంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ (33/11కేవీ) సబ్‌స్టేషన్లకు తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. అంతకుముందు నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. అలాగే మండలంలో మంజూరైన 80(25కేవీ) ట్రాన్స్‌ఫార్మర్లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కొత్తగా ఎక్కడా పన్నులు వేయకుండా మనకున్న ఆదాయంతోనే ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. 2000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నా ఒక్క నిమిషం అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బందికి కోటి రూపాయలు బీమా కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సింగరేణిలో ఉద్యోగాలు చేస్తున్న వారికి బీమా అమలవుతుందని గుర్తు చేశారు. బావులకు ఉచిత మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అటవీ శాఖ పరిధిలో ఉన్న పోడు భూముల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, వారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలలు, కాలేజీల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అందుకు సంబంధించిన సమాచారాన్ని వారం రోజుల్లో పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతోపాటు అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సీఎండీ ముషర అలీ వరూబీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మదుసూధర్‌రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దాల్ గౌతమ్‌కుమార్, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ పవర్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES