నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్‌కు లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసును పంపించారు.
బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశ పూరితమైనవని కేటీఆర్ తరపు న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజలలో కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని నోటీసులో ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు అడ్డగోలుగా ప్రాపగండ చేస్తున్న బండి సంజయ్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాదులు తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వలన కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్ అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారని అయితే బండి సంజయ్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లైంట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్షాదారాలు లేవని, ఒక పార్లమెంటు సభ్యుడుగా కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడు పైన అసత్య పూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేయడానికి లీగల్ నోటీసులు న్యాయవాదులు ప్రస్తావించారు.
బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్ తరపున బండి సంజయ్ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కేటీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఏడు రోజులలోగా ఈ డిమాండ్లను పాటించని పక్షంలో, చట్టపరంగా సివిల్-క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణల వల్ల కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు.