నవతెలంగాణ -హైదరాబాద్: చందానగర్‌లో మంగళవారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఖజానా జ్యువెలరీ దుకాణంలోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు.. కాల్పులు జరిపి భయానక వాతావరణం సృష్టించారు. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడున్న సీసీ కెమెరాలను తుపాకీ కాల్పులతో ధ్వంసం చేశారు. ఎదురుతిరిగిన జ్యువెలరీ దుకాణం డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరపడంతో.. ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఖజానా జ్యువెలరీ దుకాణంలోకి దుండగులు చొరబడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విడుదల చేశారు. దుండగులందరూ ముఖానికి మాస్కులు ధరించి.. లోపలికి ప్రవేశించారు. అందరూ ఒకేసారి కాకుండా.. ఒకరి వెనుకాల ఒకరు జ్యువెలరీలోకి ప్రవేశించారు.