పొడిగింపేనా.?..ప్రత్యేక పాలన వచ్చేనా.?
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గాలకు పదవీ కాలం గురువారంతో ముగియనుంది. ఇప్పటివరకూ ఎన్నికల ప్రక్రియ నిర్వహించకపోగా వారి పదవీకాలాన్ని పొడిగిస్తారా.? ప్రత్యేక అధికారుల పాలన తీసుకువస్తారా.? అనే చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నేటివరకు సహకార సంఘం ఎన్నికల ప్రక్రియ చేపట్టకపోగా, పాలకవర్గాల పదవీకాలం మరో ఆరుమాసాలు పొడిగిస్తారా.? ప్రత్యేక పాలన తీసుకొస్తారా ? అనే విషయంపై రాజకీ య వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే పదవీకాలం ముగిసిన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల ఎన్ని కలు జరపలేదు. వీటన్నిటికీ ప్రత్యేక పాలనాధికారులను నియమించారు. ఏడాదిన్నర క్రితం గ్రామపంచాయతీ పాలక వర్గాల పద వీకాలం, ఏడాది క్రితం మండల, జిల్లా పరిషత్ పా లకవర్గాల పదవీకాలం ముగియగా ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించలేదు. ఈఏడాది ఫిబ్రవరి 14తో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలం ముగియనున్నది.
ఎన్నికల ప్రక్రియకు దూరం..
సహకార సంఘం పదవీకాలం ముగింపు సమీస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన దాఖలాలు కనబడటం లేదు. స్థానిక సంస్థల సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లతో ముడిపడి ఉండటంతో అవీ కాస్త ఆలస్యం అవుతున్నది. ఎలాంటి చిక్కులు లేని, సహకార సంఘం ఎన్నికలను ఎందుకు చేపట్టడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
తాడిచర్ల పీఏసీఎస్ ..
తాడిచర్ల ప్రాథమిక సహకార సంఘంలో దాదాపు 3200మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం ద్వారా రైతులకు పంట రుణాలు అందజేస్తున్నారు. అలాగే ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయాలు చేస్తున్నారు. రైతులు పండించిన పంట ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మండలంలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పైగా, ప్రతీ సీజన్ లో ఏర్పాటు చేస్తున్నారు.