Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeఎడిట్ పేజిరష్యా క్రూడాయిల్‌ దిగుమతితో లబ్ధి పొందిందెవరు?

రష్యా క్రూడాయిల్‌ దిగుమతితో లబ్ధి పొందిందెవరు?

- Advertisement -

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధ్వర్యం లోని పెట్రోలియం ప్లానింగ్‌, అనాలసిస్‌ సెల్‌ (పి.పి.ఏ.సి) ప్రకారం రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ ప్రారంభ మాసాలు 2022 ఫిబ్రవరి, మార్చిలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర 94/113 డాలర్లు కాగా 2025 జూలై, ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర 70.95/ 71.17 డాలర్లు. ఇది ఒమన్‌, దుబారు దేశాల సగటు ధర. రష్యన్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఒక దశలో బ్యారెల్‌ ధర 40-45 డాలర్లకే దిగుమతి చేసుకుంది. అయినప్పటికీ బ్యారెల్‌ ముడిచమురు ధర 25 డాలర్లు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ తగ్గించలేదు. పిపిఏసి డేటా ప్రకారం చెన్నరు మెట్రోపాలిటన్‌ సిటీలో 2022 ఫిబ్రవరి,మార్చిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.40, డీజిల్‌ లీటర్‌ రూ.91.43 పైసలు కాగా 2025 ఆగస్టులో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.80, డీజిల్‌ రూ.92.39 పైసలు.రష్యన్‌ క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు వలన అమ్ముకున్న రష్యా, కొనుగోలు చేసిన రిలయన్స్‌, నయారా వంటి రిఫైనరీ కంపెనీలు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలుచేసిన యూరప్‌ దేశాలు, అమెరికానే ప్రధానంగా లబ్ధి పొందాయి తప్పితే భారత దేశానికి ఎటువంటి ఉపయోగం జరగలేదు.

సీపీఐ(ఎం) కార్యక్రమంలో చెప్పినట్టుగా భారత పాలక వర్గాల స్వభావం కూడా ఇక్కడ స్పష్టమైంది. ఈ విషయంలో స్వదేశీ గుత్త పెట్టుబడిదారుల లాభాల కోసం అమెరికన్‌ సామ్రాజ్యవాదాన్ని కూడా వ్యతిరేకిస్తున్నది. దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాల్లో దేశ ప్రజల ప్రయోజనాన్ని పణంగా పెట్టి అమెరికన్‌ సామ్రా జ్యవాదులతో రాజీ పడుతున్నది. ట్రంప్‌ మనఎగుమతులపై విధించిన 25శాతం సుంకాలు, విధిస్తానని ప్రకటించిన మరో 25శాతం సుంకాలతో టెక్స్‌టైల్‌, ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ డివైజ్‌లు, వాహనాల విడిభాగాలు, రత్నాలు, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు తదితర పరిశ్ర మలపై, వీటిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధి పైన, చిరువ్యాపారస్తులపై తీవ్ర ప్రభావం పడను న్నది. దీనిపై మోడీ గట్టిగా మాట్లాడటం లేదు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు భారత దేశం చేసుకునే మొత్తం క్రూడ్‌ ఆయిల్‌ దిగు మతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. జులై 2025 నాటికి సగటున 40 శాతంగా ఉన్నది. ఇరాక్‌, సౌదీ అరేబియా వంటి సాంప్రదాయ మధ్యప్రాచ్య సరఫరాదారులను వెనక్కి నెట్టేసింది. రష్యన్‌ దిగుమతులు మే 2023లో రోజుకు 2.15 మిలియన్‌ బ్యారెల్స్‌ (బిపిడి)తో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జూలై 2024లో రష్యా రోజుకి 2 మిలియన్‌ బ్యారల్స్‌ కంటే ఎక్కువ సరఫరా చేసింది.

ఇది మన దేశ ముడి చమురు వినియోగంలో 41శాతం. ఇరాక్‌ వాటా ఇరవై శాతం, సౌదీ అరేబియా పదకొండు శాతం, యునైటెడ్‌ స్టేట్స్‌ వాటా కేవలం నాలుగు శాతం మాత్రమే. ప్రస్తుత నెలవారీ సగటు 1.75 నుండి 1.78 మిలియన్‌ బ్యారెళ్ల వరకు ఉంది. రష్యా నుండి మన దేశం దిగు మతి చేసుకుంటున్నా ముడిచమురులో యాభై శాతానికి పైగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌, నయారా ఎనర్జీ శుద్ధి కర్మా గారాలకే సరఫరా అవుతున్నది. రష్యన్‌ చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్‌ నయారాలో 49 శాతం వాటా కలిగి ఉన్నది. అయితే యూరప్‌కు ప్రధాన ఎగుమతిదారుగా రిలయన్స్‌ ఉంది. రష్యన్‌ ముడి చమురు వలన లబ్ధి పొందింది. 2024లో యూరప్‌కు వారి మొత్తం శుద్ధి చేసిన ఉత్పత్తి ఎగుమతులుసగటున రోజుకు రెండు లక్షల బ్యారెళ్లుగా ఉన్నాయి. యూరప్‌కు భారత పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 2019లో డాలర్‌ 5.9 బిలియన్ల నుండి డాలర్‌ 20.5 బిలియన్లకు పెరిగాయి. దీనికి కారణం భారత దేశం తక్కువ ధరతో కూడిన రష్యన్‌ ముడిచమురును కొనుగోలు చేసి, శుద్ధి చేసి పశ్చిమ దేశాలకు విక్రయించడమే.

జి7-ఈయు-ఆస్ట్రేలియా దేశాలు డిసెంబర్‌ 2022లో రష్యాపై బ్యారెల్‌కు డాలర్‌ 60 ధర పరిమితితో సహా పలు ఆంక్షలు విధించిన తర్వాత, రష్యా తన చమురు ఆదాయాన్ని కొనసాగించడానికి భారతదేశం, చైనా వంటి దేశాలను ఆశ్రయిం చింది. రష్యన్‌ ముడి చమురు బ్రెంట్‌ ధరల కంటే దాదాపు డాలర్‌ 40 తక్కువకు అమ్ముడైంది. అమెరికా, పశ్చిమ దేశాలు వారు కోరుకోనప్పుడు రష్యన్‌ ముడిచమురు కొనుగోలుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలో భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్‌ గార్సెట్టి 2024 మేలో వాషింగ్టన్‌లో కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌లో ‘వారు (భారతదేశం) రష్యన్‌ చమురును కొనుగోలు చేశారు. ఎందు కంటే మేము ఎవరైనా రష్యన్‌ చమురును పరిమితి ధరకు కొనుగోలు చేయాలని కోరుకున్నాము. అది ఉల్లంఘన కాదు’ అన్నారు. ‘జనవరి 2024 నుండి జనవరి 2025 చివరివరకు భారతదేశం, టర్కీలోని ఆరు శుద్ధి కర్మా గారాలలో రష్యన్‌ ముడిచమురు నుండి శుద్ధి చేసిన ఆ1.3 బిలియన్ల చమురును అమెరికా దిగుమతి చేసుకుంది’ అని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (సిఆర్‌ఇఎ) ఒక నివేదికలో తెలిపింది.గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్‌ చమురు శుద్ధి కర్మాగారాల్లో రష్యన్‌ ముడి చమురు నుండి శుద్ధి చేయబడిన ఆ 724 మిలియన్ల పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఆ2 ఇంధనాలను దిగుమతి అమెరికా చేసుకుంది.

ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులకు ఇండియా ఎందుకు గట్టిగా ఎదిరించలేక పోతున్నది? చైనా ఎందుకు గట్టిగా ఎదిరించగలిగింది. అమెరికా సంక్షోభం సుంకాల విధింపుతో పరిష్కారం అవుతుందా? భారత దేశీయ మార్కెట్‌ పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి మందగించింది. గ్రామీణ వ్యవసాయ సంక్షోభం కొనసాగు తున్నది. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఉపాధి హామీకి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులకు కోత విధిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరుకున్నది. కార్మికుల నిజ వేతనాలు పడిపోయాయి. చైనా తన అంతర్గత మార్కెట్‌పై దృష్టిపెట్టింది. కార్మికుల వేతనాలు గణనీయంగా పెంచింది. దేశ మౌలిక రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు, వేలకోట్లు ఖర్చు చేస్తున్నది. వెనుకబడిన పశ్చిమ ప్రాంతాల కొండ,లోయల ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రీకరించింది. నూతన ఆవిష్కరణలు, పేటెంట్ల కోసం దరఖాస్తులు అమెరికాను ఎప్పుడో మించిపోయింది. మౌలిక వసతులు, టెక్నాలజీ అభివృద్ధి, నైపుణ్యంగల మానవ వనరులను వృద్ధి చేసుకోవడం వలన చైనా తక్కువఖర్చుతో వస్తు ఉత్పత్తి గణనీయంగా చేయగలుగుతున్నది. అమెరికాకు ప్రత్యామ్నా యంగా ఆఫ్రికా దేశాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లకు ఎగుమతులు పెంచుకుంటున్నది. అమెరికా టారిఫ్‌ బెదిరింపులకు వెరవకుండా ప్రతీకార టాక్సులు ప్రకటించగలిగింది. అమెరికా దిగొచ్చింది.

ఇందుకు భిన్నంగా భారత పాలకుల పరిస్థితి ఉన్నది. సామ్రాజ్యవాదానికి ఊడి గం చేయడం ఆరెస్సెస్‌- బీజేపీ డిఎన్‌ఎలోనే ఉన్నది. నాటి వలసపాలకులైన బ్రిటిష్‌వారికి, నేడు అమెరికన్‌ సామ్రాజ్య వాదానికి లొంగిపోతున్నది. 1970వ దశకం నుండే అమెరికా, యూరప్‌ దేశాల నుండి పరిశ్రమలు మూడవ ప్రపంచ దేశాలకు ముఖ్యంగా చైనాకు తరలితున్నాయి. ఎందుకు? అభివృద్ధి చెందిన దేశాల్లోని కార్పొరేట్‌, మల్టీ నేషనల్‌ కంపెనీలు అత్య ధిక లాభాలు ఆర్జించడం, మూడో ప్రపంచ దేశాల కార్మికుల శ్రమదోపిడీ లక్ష్యంగా చోటుచేసుకున్నదే ఈ పరిణామం. అమెరికాలో జీవించడానికి కావలసిన ఖర్చులు ఎక్కువ. గృహ వసతి, కిరాణా ఖర్చులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు, ఎలక్ట్రి సిటీ, వాటర్‌ వంటి ఖర్చులు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, పర్సనల్‌ కేర్‌, వినోదం తదితరాలకు అధిక మొత్తం ఉంటుంది. అమెరికాలో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నెలసరి సగటు ఖర్చు నాలుగు వేల డాలర్లు అవుతుండగా చైనాలో 14 వందల డాలర్లు, ఇండియాలో 500 డాలర్లు. అదే సమయంలో అమెరికాలో ఒక సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సగటు నెలజీతం 6250 డాలర్లు, చైనాలో 4660 డాలర్లు, ఇండియాలో 800 డాలర్లు. అమెరికాలో జీవన వ్యయం ఎక్కు వగా ఉండడానికి, చైనాలో తక్కువ ఉండడానికి కారణం రెండు భిన్నమైన ఆర్థిక వ్యవస్థలు. మొదటిది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కాగా, రెండోది సోషలిస్ట్‌ ఆర్థిక వ్యవస్థ. మౌలిక వసతుల కల్పనలో చైనా ప్రభుత్వ పెట్టుబడులు, గృహ వసతి, ప్రయాణ ఖర్చులు తక్కువగా ఉండడం, కార్మికుల, ఉద్యోగుల పిల్లలకు క్రేచ్‌ సెంటర్లు, క్యాంటీన్ల ఏర్పాటు తదితర అనేక సామాజిక కార్యక్రమాల కారణంగా అక్కడ ప్రజల జీవన వ్యయం తక్కువగా ఉంటున్నది. అమెరికాలో దీనికి పూర్తి భిన్నం. అక్కడ కంపెనీలు తిరిగి ఉత్పత్తులు చేయాలంటే ఉత్పత్తి ఖర్చులు తగ్గాలి. అవి తగ్గాలంటే చైనా అనుసరిస్తున్న సోషలిస్ట్‌ మార్గంలో పయ నించాలి. అప్పుడే అమెరికా సంక్షోభం నుంచి బయటపడు తుంది. అంతేకానీ, ఉత్పత్తి రంగంలో ఏర్పడిన సంక్షోభానికి సుం కాల విధింపుతో పరిష్కారం దొరకదు.
గీట్ల ముకుందరెడ్డి
9490098857

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad