Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరైతులతో రాక్షసుల్లా ప్రవర్తిస్తారా?

రైతులతో రాక్షసుల్లా ప్రవర్తిస్తారా?

- Advertisement -

– కాగితాల్లోనే యూరియా కేటాయింపులు
– ఎరువుల కోసం కొన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెడతారా?
– కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటం ఆగదు :
బీజేపీ సర్కారుపై మంత్రి తుమ్మల విమర్శలు
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌

రైతుల పట్ల రాక్షసుల్లా ప్రవర్తించడం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా, ఎరువులను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ద్వంద్వ వైఖరిపై మంత్రి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కేటాయింపులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం తిరిగి రాష్ట్రానికి లేఖలు రాయడమే తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని తెలిపారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమను ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి ఎన్నోసార్లు కేంద్రం తలుపు తట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగానే కాకుండా స్వయంగా సీఎం కూడా కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ అధికారులు కూడా నెలకోసారి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసినట్టు తెలిపారు. రాష్ట్రానికి సరిపడినంత యూరియా వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రులను కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. రైతన్నల పట్ల ఇలాంటి కఠిన వైఖరి సరైంది కాదని తెలిపారు. ఆగస్టు మాసంలో రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ పొలాల్లో ఉండాలే తప్ప యూరియా కోసం క్యూ లైన్లో కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కారణమైన కేంద్ర ప్రభుత్వంతో ఎంత వరకైనా పోరాడుతామని తెలిపారు. యూరియా కేటాయింపులు 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు…అయినా ఏప్రిల్‌ నుంచి జూలై వరకు కొరత ఏర్పడిందని తెలిపారు. ఆగస్టు నెలలోనూ లోటు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడుతామని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad