Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంజర్నలిస్టుల సమస్యలపై రాజీలేనిపోరు

జర్నలిస్టుల సమస్యలపై రాజీలేనిపోరు

- Advertisement -

ఇండ్లస్థలాల కోసం కొత్త విధానం తేవాలి
సర్కారుకు ఫెడరేషన్‌ విజ్ఞప్తి
టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్రకార్యవర్గ సమావేశంలో
ప్రధానకార్యదర్శి బసవపున్నయ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలోని వర్కింగ్‌ జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య అన్నారు. ఇండ్లస్థలాల విషయంలో ప్రభుత్వం కొత్త విధానం తేవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల రద్దుతో కనీస వేతనాలను సైతం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బసవపున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వక దాదాపు సంవత్సరం గడస్తున్నదని గుర్తు చేశారు. కొత్త విధానం అమలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థల్లో వేజ్‌ బోర్డు అమలుచేయకుండా తాత్సారం చేయడాన్ని ఖండించారు. కార్మిక శాఖ ఇందుకు చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. గతంలోని సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయాలని కోరారు. మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట పనిచేసే సంస్థ నుంచి ఇంటి వరకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ ఉపాధ్యక్షులు రాంచందర్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు. వెంటనే సమాచార శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు గత కార్యకలాపాల నివేదికను ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య సమర్పించారు. చర్చల అనంతరం జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేశారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాల కోసం కొత్త విధానం తేవాలనీ, మీడియా స్వేచ్ఛను కాపాడాలనీ, కొత్త అక్రిడిటేషన్లను మంజూరు చేయాలనీ, చిన్న, మధ్య తరహా పత్రికల సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆఫీసు బేరర్లు చంద్రశేఖర్‌, దయాసాగర్‌, తాటికొండ కృష్ణ, వెంకటేష్‌ గుడిగ రఘు, సలీమ, జగదీష్‌, వెంకటేష్‌, రాజశేఖర్‌, నిరంజన్‌, బిక్షపతి, మణిమాల, నాగవాణి, విజయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad