Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంతెలంగాణకు కేంద్రం అన్యాయం

తెలంగాణకు కేంద్రం అన్యాయం

- Advertisement -

సెమీ కండక్టర్‌ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. సెమీకండక్టర్‌ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష చూపించిందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. ‘ప్రపంచ స్థాయి అధునాతన సిస్టమ్‌ అండ్‌ ప్యాకేజింగ్‌ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. మహేశ్వరంలో పదెకరాల భూమి కేటాయించాం. అన్ని రకాల సబ్సిడీలకు ఆమోదం తెలిపాం. రికార్డు సమయంలో అన్ని అనుమతులిచ్చాం. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలు పెట్టేందుకు సదరు ఇన్వెస్టర్‌ సిద్ధంగా ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీకెలా కేటాయిస్తారు..?
అన్ని రకాలుగా అర్హతలున్నా తెలంగాణను విస్మరించి కనీస సంసిద్ధత లేని ఏపీకి ప్రాజెక్టును ఎలా కేటాయిస్తారని శ్రీధర్‌ బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘తర్కానికి అందని, న్యాయ విరుద్ధమైన ఈ నిర్ణయం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదముంది. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు దేశ పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మరోసారి పున:పరిశీలించాల్సిన అవసరముంది. వాస్తవ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని తెలంగాణకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలి’ అని మంత్రి డిమాండ్‌ చేశారు.
కిషన్‌ రెడ్డి చొరవ తీసుకోవాలి…
‘కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాలి. న్యాయం జరిగేలా చొరవ చూపాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికీ స్పందించకపోతే తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు’ అని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad