– ఫీజులు, సర్టిఫికెట్లను ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎప్‌సెట్ ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొని నచ్చని కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థులు ఆ సీటు రద్దు చేసుకునే అవకాశం కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజినీకాంత్, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్ సీటును రద్దు చేసుకుని ఇతర కోర్సుల్లో చేరేందుకు అవకాశం లేకుండా చేయడం సరైంది కాదని తెలిపారు. ఈ నిబంధనను ఉపయోగించుకుని కొన్ని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు తప్పనిసరిగా చదవాలనీ, లేకపోతే ఫీజులు, సర్టిఫికెట్లను వెనక్కి ఇవ్వబోమంటున్నాయని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల ఫీజులు, సర్టిఫికెట్లను ఇవ్వని కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్‌సెట్ రెండో విడతలో సీటు పొందిన విద్యార్థులు కేటాయించిన కాలేజీలో రిపోర్టు చేసిన తర్వాతే మూడో విడత కౌన్సెలింగ్‌కు అర్హులని తెలిపారు. దీంతో విద్యార్థులు టీసీలు, ఇతర సర్టిఫికెట్లు ఆ కాలేజీల్లో ఇచ్చి, ఫీజులను చెల్లించారని వివరించారు. మూడో విడతలో వేరే కాలేజీలో సీటు వసే ఇప్పుడు ఆ ఫీజులు, సర్టిఫికెట్లను కాలేజీలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు మూడో విడతలోనూ నచ్చిన కాలేజీలో సీట్లు పొందలేకపోయారని తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఫీజులు, సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వకుండా ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థుల ను వేధింపులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. అధికారులు కూడా ఆ కాలేజీలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్ సీటు రద్దు చేసుకునే అవకాశమివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES