నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌లో జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందించనున్నారు.
ప్రతి జిల్లాలో పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, ఇంటర్మీడియట్‌లో టాపర్లుగా నిలిచిన ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నారు.అంటే, ప్రతి జిల్లాలో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఈ నగదు ప్రోత్సాహకాన్ని పొందుతారు. ఈ విద్యార్థులకు ఆయా జిల్లాల్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సత్కరించి ప్రశంసాపత్రాలతో పాటు నగదు బహుమతిని అందజేయనున్నారు.
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, జనరల్ గురుకులాల్లో ఇంటర్ విద్య చదివే విద్యార్థులను మాత్రమే ఈ నగదు బహుమతులకు పరిగణనలోకి తీసుకుంటారు.