నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక,రాజకీయ వారసత్వానికి ప్రతినిధి అయిన కేటీఆర్ రాక సింగపూర్ తెలుగు సమాజానికి స్పూర్తి అని అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సింగపూర్‌లోని ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ ‘సింగపూర్ తెలుగు సమాజం’ తన స్వర్ణోత్సవ వేడుకలకు తెలంగాణ శాసనసభ సభ్యులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ను ప్రధాన అతిథిగా ఆహ్వానించింది. ఆగస్టు 31 తేదీన మెరీనా బే సాండ్స్ సింగపూర్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు కేటీఆర్‌కు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారికంగా లేఖ రాశారు.
తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం సింగపూర్ తెలుగు సమాజం కృషి చేస్తుందని శ్రీనివాసరెడ్డి ఆ లేఖలో తెలిపారు. సింగపూర్ లో ఉండే తెలుగు ప్రజల మధ్య ఐక్యత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ వారసత్వానికి ప్రతినిధి అయిన కేటీఆర్ రాక సింగపూర్ తెలుగు సమాజానికి స్పూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని తమ సంస్థకు గౌరవం ఇవ్వాల్సిందిగా ఆయన కేటీఆర్‌ను కోరారు. సింగపూర్ తెలుగు సమాజం ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరించారు.