భారత దేశ స్వాత్రంత్రం అనగానే మొదట గాంధీజీ, తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభారు పటేల్, భగత్‌సింగ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరారు, సరోజిని నాయుడు.. ఇలా చెప్పుకుంటుపోతే చరిత్రలో ఎంతోమంది నిలుస్తారు. వారి త్యాగాలను కాదనలేము, అందరికీ వందనాలు. కానీ, ఈదేశానికి మొదట జైహింద్ నినాదమిచ్చిందెవరు, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నదెవరు? మొదటి జాతీయగీతం రాసిందెవరు? భగత్‌సింగ్‌కు తోడుగా నిలిచింది ఎవరు? చాలామందికి తెలియదు. ఖిలాఫత్ ఆందోళన్, రేష్మి రుమాల్ ఉద్యమం చేసిందెవరు? అసలు జాతీయ జెండా త్రివర్ణ పతాకానికి వర్తమాన రూపం ఇచ్చింది హైదరాబాద్ వాసి అని ఎంతమందికి తెలుసు? ముస్లింల దేశ భక్తి, దేశంకోసం, దేశ విముక్తి కోసం హిందువులతో పాటు రక్తాన్ని ధారపోశారు. సర్వం త్యాగం చేసిన భారతీయ ముస్లిం సమర యోధులను చరిత్ర నుంచి చించివేసినా…రక్తం చిందిన ఈదేశ మట్టి మరువగలదా? దేశ స్వాత్రంత్రం కోసం ధన, ప్రాణత్యాగాలను లెక్కచేయకుండా బలైపోయిన కొం దరు ముస్లిం మహనీయుల చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
స్వాతంత్య్రం కోసం ఆనాడు వందల మంది ముస్లింలు పోరాడారు. బ్రిటిష్ అరాచకాలను ఎదుర్కోడానికి మొదట ప్రాణత్యాగం చేసింది ‘మౌల్వి అహ్మదుల్లా షా’. ఆయనపై ఆంగ్లేయులు రూ.50వేల బహుమతి ప్రకటించి ఉరిశిక్ష వేసిన సంగతి చరిత్ర మరవదు.1857లో సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాత్రంత్య్ర సమరం మొదలైంది. ఆనాటి విద్రోహంలో హిందువులతో పాటు లక్షలాది ముస్లింలు మరణించారు. ఢిల్లీ నుండి కలకత్తా వరకు చెట్లపై వేలాడబడిన మత గురువుల శవాలు, యాభై వేల మంది వరకు ఉరిశిక్ష వేయబడినట్టు అంచనా. వేలాది మంది జైలు పాలయ్యారు. అండమాన్‌లోని కాలాపాని జైల్లో తొంభైశాతం ముస్లింలే. ఈనాటికి అక్కడ అధికంగా ముస్లింల సమాధులే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యువతను తయారు చేయడానికి మౌలానా ‘ఖాసీం నానోతి’ ఉత్తర్ ప్రదేశ్‌లో దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ మదర్సాను(పాఠశాల) నెలకొల్పారు. ఈమదర్సానుండి వచ్చిన మౌలానా మహముద్ హాసన్, ఉబెదుల్ల సింధి వంటి విప్లవకారులు 1916-20లో రేష్మి రుమాల్ ఆందోళన చేపట్టారు.
విదేశాల్లో కూడా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం నడిపారు.
1919లో గాంధిజీతో కలిసి భారతీయ ముస్లింలు అలీ బ్రదర్స్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం చేపట్టారు. ముస్లింలీగ్ నాయ కుడైన అలీ జవహర్ ఖిలఫత్ ఉద్యమానికి ప్రముఖ పాత్ర పోషించారు. మరొక ఆశ్చర్యకర విషయమేమంటే 1803లోనే ఇస్లామిక్ పండితుడైన షా అబ్దుల్ అజిజ్ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ఏకంగా ఫత్వనే జారీచేశారు. వారికి గులాంగిరి చేయడం హరాం (పాపం) ప్రతి ముస్లిం దేశం కోసం తమకు తాము ప్రాణత్యాగానికి సన్నద్ధం కావాలని ఫత్వలో ఆదేశించడం విశేషం. ఇలాంటి ఆదేశాల ప్రభావం వల్లనే ఎంతోమంది ముస్లింలు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. అందుకే అతి పిన్నా వయస్కుడైన విప్లవకారుడు అశ్వాఖ్ ఉల్లా ఖాన్ ‘నా మాతృభూమిని బ్రిటీష్ శృంఖలాల నుంచి విముక్తి చేయాలనుకున్నాను. నాత్యాగం వృథాకాదు మరెందరికో స్ఫూర్తినిస్తుంది. మతం ఏదైనా ఆంగ్లేయులను ఎది రించడానికి ఐకమత్యంగా ఉండాలి’ అని చెప్పి మరీ ఉరితాడును ముద్దాడి మెడలో వేసుకున్నాడు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్‌కంటే నాలుగేళ్ల ముందే ఉరిశిక్ష పడిన దేశభక్తుడు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కథనాలు రాసినందుకు ఉరిశిక్ష పడ్డ మౌలానా మీర్ బాకర్ మొదటి పత్రకారుడు.
1919లో జలియన్ వాలాబాగ్ ఘటనల జనరల్ డయ్యార్ జరిపిన కాల్పుల్లో కూడా చాలామంది ముస్లింలు మరణించారు. 19 28లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ”సైమన్ గో బ్యాక్” ఉద్యమ నినాద సోషలిస్టు నాయకుడు, ముంబాయి వాసి యూసుఫ్ మెహర్ అలీ. 1942లో గాంధీజీ నాయకత్వంలో చేపట్టిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం.. స్వరాజ్యం సాధించాలన్న భారతీయుల ఆకాంక్షను బలంగా చాటిచెప్పింది. గాంధీకి తోడుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, అరుణ అసఫ్ అలీ నిలిచారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా భారత చక్కెర వ్యాపారవేత్త హాజీసిద్దిఖి తన చక్కెర కర్మాగారన్ని మూసివేశారు. ఇది ఇంగ్లాండ్‌లో అధికంగా చక్కెర సప్లై చేసే అతిపెద్ద భారత ఫ్యాక్టరీ. కలకత్తా నగర బడా వ్యాపారవేత్త హాజీఉస్మాన్‌కు 1920వరకు కలకత్తాలోని అన్ని పాఠశాలలు, పెద్ద పెద్ద వ్యాపార భవనాలన్నీ ఆయనవే. స్వాతంత్య్ర పోరాటం కోసం వాటన్నిటిని దానంచేసి చివరికి కిరాయి ఇంట్లో గడిపారు. కేవలం త్యాగాలే కాకుండా హిందూమత సమరయోధులకు తోడుగా నిలిచి ఐక్యతను కాపాడారు. భగత్‌సింగ్‌ను కాపాడడానికి కేసు వాదించింది భారీష్టర్ ఆసిఫ్ అలీ అనే ముస్లిం న్యాయవాది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ సర్కార్ ఆఫ్గనిస్థాన్‌లో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో సహాయపడ్డది ఉబెదుల్ల సింధి, రాజా మహేంద్ర ప్రతాప్, మౌలానా బర్కతుల్లా లాంటి వారే. దేశభక్తి గీతాలు, ఉర్దూ కవితలకు ఆజ్యం పోసింది ముస్లింలే. సారె జహాసే అచ్ఛా గీతాన్ని రాసిన మహమ్మద్ ఇక్బాల్ దేశానికే వన్నె తెచ్చారు. గాంధీజీ జైలులో ఉన్నప్పుడు ఆ గేయాన్ని ఇరవైసార్లు పాడారట! మన జాతీయగీతం అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొస్తారు. చాలామందికి తెలియనిదేమంటే 1857లోనే అజిముల్లా ఖాన్ అనే విప్లవ రచయిత ”హం హై ఇస్కె మాలిక్, హిందూస్తాన్ హమారా అని” మొట్టమొదటి జాతీయగీతాన్ని రచించి అలపించారు.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్నిచ్చింది హస్రత్ మొహాని. జైహింద్ నినాదాన్నిచ్చింది అబిద్ హాసన్ సఫానీ.గాంధీజీకి మహాత్మా అని బిరుదునిచ్చింది మౌలానా మహాముద్ హాసన్. కాబట్టే ఈనాటికీ గాంధీని మహాత్మాగాంధీ అని పిలుస్తున్నాం. మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కానీ, దానికి అశోకచక్రాన్ని చేర్చి వర్తమాన తుది రూపమిచ్చింది బద్రోద్దీన్ త్యాబ్జి భార్య సురయ్య తయ్యబ్. ఆమె హైదరాబాద్ నివాసి కావడం మనకు గర్వకారణం. ఈవిధంగా ముస్లిం మేధావులు, పండితులు, న్యాయ వాదులు, విప్లవకారులు మొత్తం దేశాన్నే మేల్కొలిపారు. ఆనాడు స్వాత్రంత్య్రం కోసం మసీదులను కోటలాగా వాడుకున్నారు. ప్రతి నమాజు సమయంలో ఉద్యమ ప్రకటన చేశారు. అందుకే దేశంలోని మసీదులపై ముస్లిం యువకుల, పండితుల రక్తపు మరకులెండేవట! వీరే కాకుండా మైసూర్ టిప్పుసుల్తాన్ బ్రిటిష్ పాలకులను ఎదురించిన యోధుడు. 1857 నాటి మహిళ యోధురాలు బేగం హజ్రత్ మహల్, అమరవీరుడు పీర్‌అలీఖాన్, డాక్టర్ సైఫోద్దీన్ కిచ్లు హిందూ,ముస్లిం సిక్కుల ఐక్యతకు కృషి చేసి రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి గాంధీకి మద్దతుగా నిలిచారు. ఇస్లామిక్ సంస్కృతి పరదా పద్ధతి నుండి బయటకొచ్చి కొడుకులతో పోరాడిన అబాది బానో విప్లవ తల్లిగా నిలిచారు. ఇలా చెప్పుకుంటూపోతే వందల వేలమంది త్యాగధనులున్నారు. స్వాత్రంత్య్రం ప్రకటించిన అర్ధరాత్రి పాకిస్థాన్ విడిపోతుంటే అబుల్ కలాం ఆజాద్ ఢిల్లీ జామా మసీదు దగ్గర నిలబడి ముస్లింలను అపుతూ మన పూర్వికుల త్యాగాలు భారతదేశ మట్టిలోనే ఉన్నాయని, ఇక్కడే ఉండాలని పిలుపునిచ్చారు. ఈ దేశం హిందూ ముస్లింల ఐక్యత, త్యాగాల పునాదులపై నిర్మించబడ్డది. అందుకే మత సామరస్యం గల లౌకిక ప్రజాస్వామ్య స్వతంత్ర దేశంగా అవతరించింది.
నాడు హిందూ, ముస్లింలు ఎంతో ఐక్యతతో పోరాడి సాధించుకున్న దేశంలో నేడు ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులుగా చిత్రీకరించబడుతున్నారు. వారిని వేరుభావంతో చూస్తున్నారు. ‘భారత్ మీదేశంకాదు..పాకిస్తాన్‌కు వెళ్లిపోండి’ అంటూ ఆదేశిస్తున్నారు. ఈ దేశం ఏ ఒక్కరిదో కాదని, అందరిదని చాటిచెప్పాలి. దానికి హిందూ,ముస్లింలు ఒక్కతాటిపై నిలబడాలి. అప్పుడే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా మరింత ఉజ్వలిస్తూ ప్రగతిబాటలో సాగుతుంది.
– సయ్యద్ జబి
9949303079