జీ5 తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఈనెల 8నుంచి ప్రీమియర్ అవుతూ విశేష స్పందనను దక్కించుకుంది. శివ కష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మించిన ఈ సిరీస్ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో మేకర్స్ నిర్వహించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో హీరో అనిల్ గీలా మాట్లాడుతూ, ‘మా సిరీస్‌ని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సిరీస్ చూస్తే మన ఇంట్లో జరిగే కథలానే అనిపిస్తుంది. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన జీ5 టీంకు థ్యాంక్స్. మేం పడిన కష్టానికి తగిన మంచి ప్రతిఫలం వచ్చింది’ అని అన్నారు.
నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘ఇది మన తెలంగాణ కథ అయినా అందరూ చూసేలా తెరకెక్కించాం. ఇక ముందు మా నుంచి ప్రపంచ స్థాయి కంటెంట్ వస్తుంది’ అని చెప్పారు.
‘ఈ సిరీస్‌ను మా నాన్నకి అంకితం చేస్తున్నాను. మావి గల్ఫ్ బతుకులు.. గల్ఫ్ మెతుకులు. ఇందులోని ఫ్లాష్ బ్యాక్‌లో క్యాసెట్ సీన్‌ను నా జీవితంలో చూశాను. నాకంటే మా నాన్నకే సినిమాలంటే ఎక్కువగా ఇష్టం. సిరీస్ కోసం మా టీం అంతా చాలా కష్టపడింది. శ్రీకాంత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోయి ఉంటే ఈ సిరీస్ ఇంత గొప్పగా వచ్చేది కాదు. అనిల్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాడు. వర్షిణి, మాన్సీ అందరూ అద్భుతంగా నటించారు. ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు’ అని దర్శకుడు శివ కష్ణ బుర్రా తెలిపారు.