రజనీకాంత్, అమీర్‌ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, షౌబిన్ షాహిర్ వంటి హేమాహేమీలు.. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్.. ఖర్చుకు ఏమాత్రం రాజీపడని భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. నాగార్జున లాంటి హీరో తొలిసారి విలన్‌గా యాక్ట్ చేయటం..
ఇవన్నీ ‘కూలీ’ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ఈ హైప్‌తో ఊహించని రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. రజనీకాంత్ 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భాన్ని మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసి, సక్సెస్ అయ్యారు. ఇక ప్రభుత్వాల సహకారంతో టిక్కెట్ ధరలు పెంచారు. అలాగే స్పెషల్ షోలకు అనుమతులూ పొందడంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు, ప్రేక్షకులు కూడా భారీ వర్షాల్ని సైతం లెక్క చేయకుండా థియేటర్లకు పోటెత్తారు. వెరసీ.. ‘కూలీ’ ఓపెనింగ్స్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ఇలాంటి కలెక్షన్ల సునామీ వస్తుందనే మేకర్ల అంచనా కూడా నిజమైంది. ఇదంతా ప్రేక్షకులు థియేటర్‌లోకి అడుగుపెట్టక ముందు జరిగిన తతంగం.. బోల్డెన్ని అంచనాలతో థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకులకు, రజనీ, నాగ్, అమీర్, ఉపేంద్ర అభిమానులకు కథ రూపంలో గట్టి షాకే తగిలింది. తన ప్రాణ స్నేహితుడి చావుకి గల కారణాలు తెలుసుకుని, అందుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునే హీరో కథ ఇది. లైన్‌గా చెప్పుకుంటే చాలా పేలవమైన కథ. ఇలాంటి పేలవమైన కథకి దర్శకుడు లోకేష్ భారీ సెటప్పులు వేసుకున్నాడు. ఒక పోర్ట్.. అక్కడ జరుగు తున్న స్మగ్లింగ్.. దాని వెనుక అవయవాలు బదిలీ చేసే మూఠా.. సైమన్ అనే కిరాతకుడు.. మొబైల్ క్రియేషన్ అనే పరికరం.. ఇలా చాలా లేయర్లు అల్లుకున్నాడు. ఒక నేర సామ్రాజ్యం.. దానిని అంతం చెయ్యాలి అనుకునే ఒక హీరో.. దాని చుట్టూ హీరోయిజం పండిస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మెస్మరైజ్ చేయాలనుకున్నాడు. తాను అనుకున్నది స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటంలో గిరీశ్ గంగాధరన్ కెమెరా పనితనం, అనిరుధ్ రవిచందర్ సంగీతం, ఫిలోమిన్‌రాజ్ ఎడిటింగ్ .. ఇనవ్ని అత్యద్భుతంగా కుదిరాయి.
ఇక రజనీకాంత్ ఎప్పటిలాగే తనదైన మార్క్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. ప్రతినాయకుడు సైమన్‌గా నాగార్జున అలరించాడు. (ఈ పాత్రని కూడా పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయలేదు).
దయాల్ పాత్రలో షౌభిన్ షాహిర్ అద్భుతంగా నటించాడు. అతిథి పాత్రల్లో అమీర్‌ఖాన్, ఉపేంద్ర మెరిసి వెళ్ళిపోయారు. ఇన్ని హంగులున్నప్పటికీ కథలో పవర్‌ఫుల్ కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయారు. బ్లాక్‌బస్టర్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘వార్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘వార్ 2’ సినిమా రావడం.. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు అనిల్‌కపూర్, కియారా అద్వాని, శుతోష్ రాణా, బాబీ డియోల్ వంటి దిగ్గజ నటీనటులుండటం.. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్న అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడం.. విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన యష్ రాజ్ ఫిల్మ్స్ దీన్ని నిర్మించడం.. ఇవన్ని ‘వార్2’పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ‘రా’ చీఫ్‌ని కాల్చి చంపిన మాజీ ‘రా’ ఏజెంట్ (హృతిక్‌రోషన్)ను పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన మరో ‘రా’ ఏజెంట్ విక్రమ్ (ఎన్టీఆర్) కథ ఇది. ఇది కూడా సాధారణ పాయింటే. స్పై యాక్షన్ కథల్లో యాక్షన్‌తోపాటు ఎమోషన్ కూడా చాలా అవసరం. అయితే ఇందులో ఎమోషన్‌ని గాలికి వదిలేసి, మోతాదుకించి యాక్షన్‌ని జొప్పించారు. కథలో యాక్షన్ ఓ పార్ట్ కావాలి తప్ప, యాక్షన్ కోసం కథ తయారు చేసుకోకూడదు. ‘వార్2’లో జరిగిన తప్పు ఇదే. నటన పరంగా హృతిక్‌రోషన్, ఎన్టీఆర్.. వావ్ అనేలా చేశారు. సాంకేతిక నిపుణులు తమదైన పనితనంతో మెస్మరైజ్ చేశారు. బలమైన కథ లేకపోవడం అందర్నీ నిరాశపర్చింది. కథతోపాటు నటీనటుల డైలాగ్స్ తెలుగులో సరిగ్గా లిప్‌సింగ్ అవ్వకపోవడంతో ప్రేక్షకులను కొంత చిరాకు పెట్టింది. అలాగే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న కొన్ని సన్నివేశాలూ తేలిపోయాయి. మొత్తమీద్మ ఇద్దరు టాప్ స్టార్స్ తమవంతు కష్టపడినా ఫలితం లేకపోయింది. స్టార్ హీరోల సినిమాలకు భారీ హంగులే కాదు.. అంతకుమించి కంటెంట్ ఉన్న కథలూ చాలా ముఖ్యమనే విషయాన్ని మేకర్స్ ఇప్పటికైనా గ్రహించాలి.
లెక్కకు మించి స్టార్లు..
లెక్కలేనని ఎలివేషన్లు..
అద్భుతమైన లొకేషన్లు..
ఔరా అనిపించే సెట్లు..
కళ్ళు చెదిరే విజువల్స్..
మెస్మరైజ్ చేసే ఫైట్లు..
మ్యాజిక్ చేసే మ్యూజిక్..
ఇలాంటి ఎన్ని భారీ హంగులున్నా
పేలవమైన కథలతో
సినిమాలు తీయకూడదని
గురువారం విడుదలైన
‘కూలీ’, ‘వార్ 2’ సినిమాలు
మంచి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చ
– రెడ్డి హనుమంతరావు
కటౌట్స్ సరే.. కథల్లో కంటెంట్ ఏది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES