Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుమేఘ విస్ఫోటనం

మేఘ విస్ఫోటనం

- Advertisement -

– జమ్మూకాశ్మీర్‌లో 50 మంది మృతి
– వణికిన హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ
– భారీగా ఆస్తినష్టం
– ఉప్పొంగిన యమునానది
– హిమాచల్‌లో విరిగిపడిన కొండ చరియలు
– భారీ వర్షాలతో అతలాకుతలం

క్లౌడ్‌ బరస్ట్‌… అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి వైపరీత్యం. ఆకాశం నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా విస్ఫోటనం అవుతుందో తెలీదు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లా పద్దార్‌ సబ్‌ డివిజన్‌లోని చోసిటీ గ్రామంపై క్లౌడ్‌ బరస్ట్‌ విరుచుకుపడింది. 50 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఆస్తి నష్టాన్ని ఇంకా లెక్కించలేదు. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు క్లౌడ్‌ బరస్ట్‌ తోడయ్యింది. అంచనాలకు మించి ఈ రాష్ట్రంలో జల విధ్వంసం చోటుచేసుకుంది. ఢిల్లీలోనూ అదే పరిస్థితి. వరదలు ముంచెత్తుతున్నాయి. యమునానది ఉగ్రరూపంలో ప్రవహిస్తోంది. భారత వాతావరణ కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసినా, ప్రభుత్వాలు విపత్తును నిలువరించలేకపోతున్నాయి. దేశ రాజధానిలో ప్రజలు భయంభయంగా రోజులు గడుపుతున్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జమ్మూకాశ్మీర్‌లో మేఘ విస్ఫోటనం (క్లౌడ్‌ బరస్ట్‌)తో 50 మందికి పైగా మరణించారు. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని స్థానికులు చెప్తున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లా పద్దార్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని చోసిటీ గ్రామ పరిసర ప్రాంతంలో గురువారం ఒక్కసారిగా మేఘ విస్ఫోటనం జరగడంతో ఊహించని విధంగా మెరుపు వరదలు ముంచెత్తాయి. చోసిటీలోని ఇండ్లన్నీ భారీ వర్షాలతో కూడిన ఆకస్మిక విలయానికి కొట్టుకు పోయాయి. ప్రజల్ని ముందస్తుగా అప్రమత్తం చేయడంలో అక్కడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విపత్తు సంభవించిన ప్రాంతంలో విధ్వంసం తప్ప, ఇంకేం కనిపించట్లేదు. ఇప్పటివరకు 50 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. దుర్ఘటన విషయం తెలియగానే అక్కడి ప్రభుత్వం సహాయక బృందాలకు పంపింది. శిధిలాలు, వరదల్లో చిక్కుకున్న 120 మందిని కాపాడామనీ, వారిలో 38మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, ఆర్మీ, స్థానిక వాలంటీర్లు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

కిస్త్‌వాడ్‌ జిల్లాలో ప్రసిద్ధి చెందిన మాచైల్‌ మాతా (చండీమాత)మందిరానికి వెళ్లే యాత్ర బేస్‌ పాయింట్‌ వద్ద దుర్ఘటన తీవ్రత ఎక్కువగా ఉంది. యాత్రికులు ఇక్కడే తమ వాహనాలు ఉంచి, కాలి నడకన దర్శనానికి వెళ్తారు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా మేఘ విస్ఫోటనం జరిగింది. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌ సహాయ కమిషనర్‌ పంకజ్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘కిస్త్‌వాడ్‌ ప్రాంతంలోని చోసిటీలో మెరుపు వరదలు చోటుచేసుకొన్నాయి. ఇది మాచైల్‌ మాత మందిర యాత్రకు బేస్‌ క్యాంప్‌. సహాయక కార్యక్రమాలు మొదలయ్యాయి’ చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ స్పందించారు. ‘చోసిటీలో క్లౌడ్‌ బరస్ట్‌ వల్ల భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యల్ని వేగవంతం చేసింది. నష్టాన్ని అంచనా వేయడం, వైద్య సౌకర్యాలు కల్పించడం చేస్తున్నాం. ఎప్పటిక ప్పుడు అక్కడి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నాం’ అని తెలిపారు. క్లౌడ్‌బరస్ట్‌ విధ్వంస ఘటన అనంతరం అక్కడి పరిస్థితులపై కేంద్రమంత్రి అమిత్‌షా ఆరా తీసారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ముఖ్యమంత్రితో టెలిఫోన్‌లో మాట్లాడారు. అవసరమైతే మరిన్ని కేంద్ర బలగాలను పంపిస్తామని చెప్పారు.

మాచైల్‌ యాత్ర నిలిపివేత
భారీ ప్రకృతి వైపరీత్యం నేపథ్యంలో మాచైల్‌ యాత్రను నిలిపివేస్తున్నట్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే చోసిటీకి వెళ్లాయనీ, అదనపు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. మాచైల్‌ మాతా మందిరం సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తులో ఉంది. జులై 25న ఈ యాత్ర మొదలైంది. జమ్మూ డివిజన్‌ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడకు వచ్చారు. సెప్టెంబర్‌ 5వ తేదీన ఈ యాత్ర ముగియనుంది. ఈ విషాదం నేపథ్యంలో మాచైల్‌ యాత్రను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాల్‌ సెంటర్లు ఏర్పాటు
ప్రజలు, యాత్రికులకు సహాయం అందించేందుకు కంట్రోల్‌ రూమ్‌, హెల్ప్‌ డెస్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదుగురు అధికారులను కంట్రోల్‌ రూమ్‌లో అందుబాటులో ఉంచారు. దుర్ఘటన నుంచి రక్షింపబడిన వారి వివరాలకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఫోటోలతో సహా పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకు 126 మంది మృతి
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాల విధ్వంసం వల్ల 126 మంది మరణించారనీ, మరో 36 మంది గల్లంతయ్యారని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రూ.2,031 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 63 ఆకస్మిక వరదలు, 31 క్లౌడ్‌బరస్ట్‌లు, భారీగా కొండచరియలు విరిగిపడిన ఘటనలు 57 చోటు చేసుకున్నాయి.

ఢిల్లీలోనూ….
దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని భారత వాతావరణ శాఖ ముందస్తుగానే అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారాన్ని అందించింది. రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలతో యమునా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంతోపాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆగస్టు 17 వరకు ఈ ప్రాంతంలో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం పాత రైల్వే వంతెన వద్ద 204.43 మీటర్లకు చేరుకుంది. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం కారణంగా రింగ్‌ రోడ్‌, దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఢిల్లీని కలిపే అనేక ప్రధాన మార్గాలు, సుబ్రోతో పార్క్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ద్వారకా సెక్టార్‌-20, గురుగ్రామ్‌లోని బసాయి రోడ్డు, ఘజియాబాద్‌, నోయిడాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తూర్పు ఢిల్లీలోని పాండవ్‌ నగర్‌ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోయింది. ప్రజలు దాన్నుంచి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

వణికిన హిమాచల్‌ప్రదేశ్‌…
హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా క్లౌడ్‌ బరస్ట్‌ల ద్వారా విధ్వంసం జరిగింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా, లాహౌల్‌, స్పితి ప్రాంతాల్లో చాలా నిర్మాణాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులతో సహా 300 మార్గాలను మూసివేశారు. సిమ్లా, లాహౌల్‌, స్పితి జిల్లాల్లో వరదలకు అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. గన్వి రావైన్‌లో తాజా వరదలకు ఓ పోలీసు పోస్ట్‌ కూడా కొట్టుకుపోయింది. సిమ్లాలోని విద్యుత్‌ సరఫరా కార్యాలయం దెబ్బతింది. కార్పట్‌ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు అలర్ట్‌ చేశారు. అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుల్లు జిల్లాలో క్లౌడ్‌ బరస్ట్‌ జరిగినట్టు ఆ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. భారీ వర్షాలవల్ల సహాయకచర్యలకూ విఘాతం ఏర్పడుతుందనీ, అయినా ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విపత్తు ప్రాంతాల్లో సాధ్యమైనంత వేగంగా స్పందిస్తున్నాయని వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad