Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్తయారీకి అధిక టారిఫ్‌ల ముప్పు

తయారీకి అధిక టారిఫ్‌ల ముప్పు

- Advertisement -

– ఎగుమతి రంగంలో సంక్షోభం
– పరిశ్రమ వర్గాల ఆందోళన
న్యూఢిల్లీ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన అధిక టారిఫ్‌లు భారత తయారీ రంగానికి ముప్పుగా మారాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు దేశ ఎగుమతి రంగాన్ని సంక్షోభంలోకి నెట్టనున్నాయని తెలిపారు. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కోనున్నాయి. అధిక టారిఫ్‌లతో మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చాలనే కేంద్ర లక్ష్యం నీరుగారనుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. యూఎస్‌ చర్యలు తయారీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనున్నాయని హెచ్చరికలు వస్తోన్నాయి. అధిక టారిఫ్‌లు ముఖ్యంగా దేశంలోని వస్త్ర రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని, అమెరికాకు ఎగుమతి చేస్తోన్న సుమారు 4 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.35వేల కోట్లు) విలువైన దుస్తులు ప్రమాదంలో పడ్డాయని అప్పారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఎగుమతుల ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఏఈపీసీ) సెక్రెటరీ జనరల్‌ మిథిలేశ్వర్‌ ఠాకూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
‘అమెరికా గతంలో విధించిన 25 శాతం టారిఫ్‌కు అదనంగా 25 శాతం అదనపు సుంకాలను మోపింది. దీనివల్ల భారత దుస్తుల ఎగుమతులు అమెరికా మార్కెట్‌లో పోటీతత్వాన్ని కోల్పోతాయి. అమెరికాకు దుస్తుల ఎగుమతుల్లో భారత్‌ 33 శాతం వాటాను కలిగి ఉంది. టెక్స్‌టైల్‌ రంగానికి యూఎస్‌ అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటి. ఈ టారిఫ్‌ల వల్ల 80 శాతం సాధారణ దుస్తుల ఉత్పత్తులు దాదాపు 4 బిలియన్‌ డాలర్ల విలువ చేస్తాయి. టారిఫ్‌లతో ఇవి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సుంకాల పెరుగుదల ఎగుమతిదారులను భారీ ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తాయి. ఫలితంగా ఆర్డర్‌లు రద్దు, ఆలస్యం, ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నాయి.” అని ఠాకూర్‌ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌తోనూ పోటీ పడలేము..!
ఎఇపిసి వివరణ ప్రకారం.. భారత్‌పై అమెరికా మోపిన అధిక టారిఫ్‌ల వల్ల కనీసం బంగ్లాదేశ్‌, వియత్నాం లాంటి చిన్న దేశల ఉత్పత్తులతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఈ టారిఫ్‌ల వల్ల భారత ఎగుమతిదారులు 5-6 శాతం పోటీ నష్టాన్ని ఎదుర్కోనున్నారని అంచనా. అమెరికన్‌ కొనుగోలుదారులు ఆర్డర్‌లను నిలిపివేస్తున్నారు, మరోవైపు ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల భారత ఎగుమతిదారులు ధరలను తగ్గించి నష్టాలతో విక్రయించవలసి వస్తోంది. ఈ పరిస్థితి చిన్న తరహా వ్యాపారాలకు ఉపాధి నష్టాలు, ఫ్యాక్టరీ మూసివేతలు మరియు ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చని ఏఈపీసీ హెచ్చరించింది.
ఎగుమతి ప్రోత్సాహకాలు పెంచాలి
ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సహాయం అవసరమనిఏఈపీసీ పేర్కొంది. ఎగుమతి ప్రోత్సాహకాలను పెంచాలని కోరింది. ఎంఎస్‌ఎంఈలకు సులభమైన రుణాలను అందించాలని సూచించింది. యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయాలని కోరింది. ఈ చర్యలు తీసుకోకపోతే భారత ఎగుమతి రంగం భారీ నష్టాలను చవి చూడనుందని ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad