– ప్రధాని షెహబాజ్ ప్రకటన
లాహౌర్: పాకిస్తాన్ ఇప్పుడు రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం అర్ధరాత్రి ఓ కార్యక్రమంలో ప్రకటన చేశారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ రాకెట్ ఫోర్స్ పనిచేస్తుందని వెల్లడించారు. దీనికి అత్యాధునిక టెక్నాలజీని సమకూరుస్తామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక దళంపై ఆ దేశ సైనికాధికారి ఒకరు మాట్లాడుతూ.. దీనికి ప్రత్యేకమైన కమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదాయ యుద్ధం జరుగుతున్న వేళ క్షిపణుల మోహరింపు వంటి అంశాలను ఇదే చూసుకొంటుందని పేర్కొన్నారు. ఈ రాకెట్ ఫోర్స్‌ను భారత్‌ను దృష్టిలో ఉంచుకొనే ఏర్పాటు చేస్తున్నట్టు ఓ ఆంగ్ల వార్త సంస్థకు ఆయనే వెల్లడించారు.
పాక్ స్వాతంత్య్ర వేడుకల్లో ‘గన్‌ఫైర్’..
ముగ్గురు మృతి
కరాచీ: పాకిస్తాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రుతి మించాయి. కరాచీ నగరవ్యాప్తంగా అనేక చోట్ల ‘గన్‌ఫైర్’తో వేడుకలు చేసుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిదేండ్ల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో వేర్వేరు చోట్ల జరిపిన తుపాకీ కాల్పుల్లో 64 మంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్‌లో వివిధ వేడుకల సందర్భంగా తుపాకులు చేతపట్టి, గాల్లోకి కాల్పులు జరుపుతూ సంబురాలు చేసుకునే ఘటనలు సర్వసాధారణం. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల్లో దాదాపు 95 మందికి గాయాలు కాగా, అంతకుముందు సంవత్సరం 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజా వేడుకల్లో కరాచీలోని లియాఖతాబాద్, కోరంగి, మెహబూబాబాద్, అఖ్తర్ కాలనీ, బాల్దియా, ఓరంగీ టౌన్‌తోపాటు అనేక చోట్ల గన్‌ఫైర్ చోటుచేసుకుంది. అజీజాబాద్‌లో తూటా తగిలి ఎనిమిదేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, కోరంగి ప్రాంతంలో ఓ వృద్ధుడు చనిపోయాడు.
ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 20 మంది అనుమానితులను అరెస్టు చేసినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. అయితే, నిందితుల నుంచి అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వీటిని నిర్లక్ష్య, భయభ్రాంతులకు గురిచేసే చర్యలుగా పేర్కొన్న అధికారులు నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES