కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి
బీహార్ ఎన్నికల స్టంట్…!
న్యూఢిల్లీ : వచ్చే దీపావళి కల్లా వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండు శ్లాబులను అమల్లోకి తేనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సంస్కరణల్లో భాగంగా పన్ను భారాన్ని తగ్గించడం, వినియోగదారులకు, వ్యాపారాలకు సౌలభ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే లక్ష్యంతో రూపొందించబడ్డాయని తెలిపాయి. ప్రస్తుతం జీఎస్టీలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం చొప్పున నాలుగు శ్లాబులు అమల్లో ఉన్నాయి.
అదే విధంగా కొన్ని వస్తువులపై సున్నా, లగ్జరీ వస్తువులపై సెస్ విధించబడుతుంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న రెండు రేట్ల విధానం ఈ స్లాబ్‌లను సరళీకరించే క్రమంలో వినియోగ వస్తువులకు తక్కువ రేటు, లగ్జరీ వస్తువులకు ఎక్కువ రేటును అమలు చేయాలని యోచన. నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య సంబంధిత వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ చర్య వినియోగదారులకు అధిక ధరల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు, గ్రామీణ, నగర ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచుతుందని ప్రభుత్వ వర్గాల అంచనా. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఆమోదం లభించాల్సి ఉంటుంది. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారని నిపుణులు అనుమానిస్తున్నారు. అధిక ధరలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలకుండా ఈ ప్రతిపాదన చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
త్వరలో జీఎస్టీలో రెండే శ్లాబులు
- Advertisement -
- Advertisement -