కేరళ సీఎం పినరయి హెచ్చరిక
తిరువనంతపురం : దేశాన్ని విభజిస్తున్న మత శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించారు. రాజ్యాంగ విలువలను గౌరవించాలని, దేశ ఐక్యతకు ఎదురవుతున్న అంతర్గత, బహిర్గత ముప్పును ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయోద్యమంలో ఏకతాటిపై నిలిచేందుకు ప్రజలు సామాజిక, మత విభేదాలను అధిగమించారని, దాని ఫలితమే 78 సంవత్సరాల భారత స్వాతంత్య్రమని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం సందేశమిస్తూ ప్రాంతీయ, భాషా, మత వైవిధ్యాలకు భారతదేశం ఒక నిధి వంటిదని అభివర్ణించారు. అయితే లౌకికవాదం, స్నేహం, సహజీవనం ఆధారంగా నిర్మితమైన జాతీయతను వక్రీకరించడానికి, ప్రజలను విభజించడానికి ప్రతీఘాత శక్తులు ప్రయత్నిస్తున్నాయని హెచ్చరించారు.ప్రభుత్వ విధానాలలో తప్పులను ఎత్తిచూపుతూ చేస్తున్న విమర్శలను ఈ శక్తులు దేశద్రోహంగా ముద్ర వేస్తున్నాయని, జాతీయోద్యమ సంప్రదాయాలను మసకబారుస్తున్నాయని, మత సమీకరణ ద్వారా ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని పినరయి విమర్శించారు. ప్రజాస్వామ్య సంస్కృతి ఎక్కువగా ఉన్న దేశానికి ఇలాంటి ధోరణులు తగినవా కావా అనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని పినరయి గుర్తు చేస్తూ దేశ ప్రజాస్వామ్య సంస్కృతి మూలాలు మానవత్వం, పరస్పర ప్రేమలో ఉన్నాయని, జీవన పరిస్థితులను మెరుగుపరచడం దేశ నిర్మాతలు అప్పగించిన విధి అని చెప్పారు. గత పాఠాలను ఉపయోగించుకుంటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, అందరూ సమానంగా జీవించే భారతదేశాన్ని ఊహించుకోవాలని సూచించారు. బయటి నుంచి వస్తున్న బెదిరింపులు దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తుంటే అంతర్గత బెదిరింపులు ఐక్యతను ప్రమాదంలో పడేస్తున్నాయని పినరయి చెప్పారు. మతతత్వ శక్తులు దేశ భావోద్వేగాలను బలహీనపరచడానికి కులాన్ని, మతాన్ని ఉపయోగిస్తున్నాయని అన్నారు. ఇలాంటి శక్తులను ప్రతిఘటిస్తామని, ఓడిస్తామని ప్రతినబూనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
మతశక్తులతో అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -