Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంత్యాగాలతో వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకుందాం

త్యాగాలతో వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకుందాం

- Advertisement -

– జాతీయ జెండావిష్కరణలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఎందరో మహానుభావుల త్యాగాలు, జైలు జీవితాలు, ప్రాణత్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. సాహసోపేతమైన సాహసాలతో బ్రిటీష్‌ వారిని తరిమికొట్టామని గుర్తు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఎగురు వేశారు. అనంతరం మాట్లాడుతూ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ దేశం కోసం తొమ్మిదేండ్లు జైలు జీవితాన్ని గడిపారని తెలిపారు. వారి త్యాగాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు బ్రిటీష్‌ పాలకుల అడుగులకు, మడుగులొత్తారని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వద్దంటూ బ్రిటీష్‌ ప్రభుత్వంలో అధికారం పంచుకోవడమే పరమావధిగా భావించారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షిస్తోందని ధ్వజమెత్తారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో పేదలపై తీవ్ర భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే వారసులే ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారని చెప్పారు. అలాంటి నాయకులే అధికారంలోకి వచ్చేందుకు విపరీతంగా ఓట్ల దొంగతనం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నిరూపించారని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను ఓటర్‌ జాబితా నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్యని అన్నారు. ఓట్ల తొలగింపుపై సుప్రీం కోర్టు కేంద్రానికి మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందనీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్ధం చేసుకోవాలని కోరారు. సింగల్‌ బెడ్‌ రూమ్‌ ఇంట్లో 45 ఓట్లు ఎలా ఉంటాయని చెప్పారు. భారత్‌ జోడో యాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన తెలుసుకున్నారని చెప్పారు. జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కాలంటూ రాహుల్‌ గాంధీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. కులగణన చేసి బీసీ బిల్లు తీసుకురావడంతో సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకున్నారని కొనియాడారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పేరిట పదేండ్లుగా కేసీఆర్‌ పేద ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో…పేదల కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నదని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు పోతున్నాయన్నారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీ హనుమంతరావు, సీనియర్‌ నాయకులు కుసుమకుమార్‌, ప్రొఫెసర్‌ కత్తి వెంకటస్వామి, మెట్టుసాయికుమార్‌, సేవాదళ్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad