తెల్లవారితే పాపన్న 375వ జయంతి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
16వ శతాబ్దం నాటి బాహుబలి విప్లవ యోధుడు సర్దార్ పాపన్న. 375 ఏళ్ళు దాటిన ఆయన పేరు తెలంగాణలో నేటికీ ప్రజల గుండెల్లో గుర్తిండిపోయారు. పాపన్న జన్మించి 375 సంవత్సరాలు అయ్యింది. సబ్బండ వర్గ ప్రజలను ఏకం చేసి, రాజులు భూస్వాములకు దోపిడికి వ్యతిరేకంగా ఎదురొడ్డి తెల్లోడి పాలన మీద తిరుగుబాటు ప్రకటించి, దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు చరిత్రలో స్థానం దక్కడం సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన ఒక బహుజన వీరుడు. ఆ వీరుడు ఇంకెవరో కాదు.. సర్వాయి పాపన్న. బహుజనులకే రాజ్యాధికారం దక్కాలని 17వ శతాబ్ధంలోనే గొంతెత్తి నినదించడమే కాదు.. పిడికిలి ఎత్తి పోరాడి గెలిచిన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న .
ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాం తాలూకా బెల్గాం గ్రామం 1650 ఆగస్టు 18న పుట్టిన పాపన్న… పాతికేళ్ల వయసుకి విప్లవ వీరుడుగా మారాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అభ్యుదయ భావాలతో రెబలిస్టిక్ అప్రోచ్ తో ఉండేవాడని చరిత్ర చెబుతోంది. అట్టడుగువర్గాల బానిస బతుకుల్లో వెలుగులు నింపేందుకు పోరాడిన యోధుడు.
పాపన్న అన్ని కులాలలో చైతన్యాన్ని రగిలించి, ఒక్క తాటిపైకి తెచ్చారు పాపన్న. తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహేబ్‌లతో కలిసి తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అరాచకాల గురించి వివరించి వారిలో చైతన్యం రగిల్చాడు. పాపన్న…బహుజనుల నుండి భారీ మద్దతు కూడగట్టుకున్న సర్వాయి పాపన్న.. గ్రామాల్లో శిస్తులు వసూలు చేసుకుని గోల్కొండ కోటకు తిరిగి సైనికులు వసూలు చేసిన శిస్తును తిరిగి అక్కడి గ్రామాల్లోని పంచిపెట్టడంతో మొదలైన సర్వాయి పాపన్న రాజనీతి.. హస్తినలో ఉన్న ఢిల్లీ సుల్తాను ఔరంగజేబును గడగడలాడించే వరకు వెళ్ళింది. రాజనీతిజ్ఞిని ప్రదర్శిస్తూ పేదోళ్లకు రాజయ్యాడు.
సంస్ధానాలు, దొరల గడీలపై మెరుపుదాడులు..
అరాచకశక్తులకు చరమగీతం పాడిన పాపన్న..తాను పుట్టి పెరిగిన ఖిలాషాపురంలోనే ఒక పెద్ద శత్రుదుర్భేద్యమైన దుర్గాన్ని నిర్మించి అక్కడి నుంచే తన రాజ్యపాలన ఆరంభించాడు. తన సైన్యాన్ని వెంటేసుకుని వెళ్లి చిన్న చిన్న సంస్థానాలు, దొరల గడీలపై దాడులు చేసి వాటిని ఆక్రమించుకున్నాడు. తాను ఆక్రమిస్తూ వెళ్లిన కరీంనగర్, హుస్నాబాద్, రాజ్యాలను జయించిన పాపన్న.. తాటికొండలో నిర్మించిన ఎత్తైన కోట ద్వారా సైనిక కార్యకలాపాలను మరింత ముమ్మరం చేశాడు. వరంగల్, నల్గొండ, భువనగిరి, కొలనుపాక, చేర్యాల, బైరానుపల్లి, జాఫర్‌ఘడ్, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లా పాపన్నపేట వరకు ఉన్న సంస్థానాలను గెలుచుకుని తన రాజ్యంలో కలిపేసుకున్నాడు.
బెదిరిపోయిన ఢిల్లీ సుల్తాన్ ఔరంగాజేబ సర్దార్ సర్వాయి పాపన్న ఆధీనంలోకి తీసుకున్న రాజ్యాల నుండి పన్నులు రాకపోవడం, రాజ్యాలు ఒక్కొక్కటిగా అతడి వశం అవుతుండటంతో అప్పటి ఢిల్లీ సుల్తాన్ పాపన్నను బంధించి తీసుకురావాల్సిందిగా అప్పటి కొలనుపాక పాలకుడైన రుస్తుందిల్ ఖాన్‌ను ఆదేశించారు. దీంతో ఆయన తన సైన్యాధినేత ఖాసింఖాన్‌ను పాపన్నపై దాడికి పంపించాడని, ఖిలాషాపూర్పై దాడికి వచ్చిన ఖాసింఖాన్ను హతమార్చడంతోపాటు అతడి సైన్యాన్ని తిప్పికొట్టి చరిత్ర సృష్టించాడు.
పాపన్న వీరోచిత పోరాటం చేస్తూ మరణం
బహదూర్ షా సైన్యంతో జరిగిన భీకర పోరులో తీవ్రంగా గాయపడిన పాపన్న.. ఒకప్పటి తన రాజ్యంలోని భాగమైన హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చాడని, ఆ ప్రాంతంలో 1709లో మొఘల్ సైన్యంతో జరిగిన యుద్ధంలో వీరోచిత పోరాటం చేస్తూ బంధించబడిన పాపన్నను కొద్ది రోజుల తర్వాత ఉరితీశారు.
లండన్ మ్యూజియంలోపాపన్న విగ్రహం..
సబ్బండ వర్ణాలకు స్ఫూర్తి ప్రధాత, పేదల గుండెల్లో పెట్టుకొని పూజించే రారాజు సర్వాయి పాపన్న గౌడ్.. లండన్ విక్టోరియా మహల్ మ్యూజియంలో ఉన్న పాపన్న ప్రతిమలు చరిత్రలో ఆయన పేరు స్థిరంగా నిలబడిపోయింది..