Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపెరుగుతున్న నకిలీ నోట్ల స్వాధీనాలు

పెరుగుతున్న నకిలీ నోట్ల స్వాధీనాలు

- Advertisement -

– రూ.200 నోట్లలోనూ నకిలీల పెరుగుదల
– అయినా తగ్గుతున్న కేసులు
న్యూఢిల్లీ :
2017-2021 మధ్యకాలంలో అంటే ఐదు సంవత్సరాలలో దేశంలో అధికారులు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల సంఖ్య రెట్టింపైంది. అయితే ఆయా ఘటనల్లో నమోదు చేసిన కేసుల సంఖ్య మాత్రం సగానికి పడిపోయింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వద్ద అందుబాటులో ఉన్న 2022వ సంవత్సరపు డేటా ప్రకారం దర్యాప్తు సంస్థలు రూ.382 కోట్ల విలువైన 42 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో…అంటే 2021తో పోలిస్తే పరిమాణంలో ఏడు రెట్లు, విలువలో 19 రెట్లు అదనం.
బ్యాంకులకు చేరని నకిలీలు
కానీ రిజర్వ్‌బ్యాంక్‌ డేటా ప్రకారం నకిలీ నోట్లు కొద్ది సంఖ్యలో మాత్రమే బ్యాంకులకు చేరుకున్నాయి. 2022లో బ్యాంకులు 2,30,000 నకిలీ నోట్లను గుర్తించాయి. అంటే చలామణిలో ఉన్న ప్రతి పది లక్షల నోట్లలోనూ రెండు మాత్రమే నకిలీ నోట్లు ఉన్నాయన్న మాట. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించిన తర్వాత ప్రతి లక్ష నోట్లలో ఏడింటిని బ్యాంకులు నకిలీవిగా గుర్తించాయి. అయితే అదే సంవత్సరానికి సంబంధించిన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా దీనికి భిన్నంగా ఉంది. దర్యాప్తు సంస్థలు 42 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నాయని ఆ డేటా చెబుతోంది. అంటే లక్షకు 32 నకిలీ నోట్లన్న మాట. మొత్తంమీద ఈ సంవత్సరం మార్చి నెలాఖరుకు నిర్దిష్ట డినామినేషన్‌తో చలామణిలో ఉన్న ప్రతి పది లక్షల నోట్లలోనూ రూ.100, రూ.500 విలువ కలిగిన రెండేసి నకిలీ నోట్లను, రూ.200 విలువ కలిగిన నాలుగు నకిలీ నోట్లను బ్యాంకులు గుర్తించాయి.
పెరగని కేసులు
అయితే ఇక్కడ గమనించాల్సిన కీలక విషయమేమంటే దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకుంటున్న నకిలీ నోట్ల సంఖ్య పెరుగుతోంది కానీ వాటిపై నమోదు చేస్తున్న కేసుల సంఖ్య తగ్గిపోతోంది. 2015లో అధికారులు 1,662 కేసులు నమోదు చేయగా 2021లో నమోదైనవి కేవలం 688 మాత్రమే. బ్యాంకులు గుర్తించిన నకిలీ నోట్లలో రూ.500 నోట్లే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే 2017లో రూ.200 నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత వాటి నకిలీల బెడద కూడా క్రమేపీ పెరుగుతోంది. 2017-18లో కేవలం 79 నకిలీ రూ.200ల నోట్లను మాత్రమే బ్యాంకులు గుర్తించగా 2024-25లో ఆ సంఖ్య 32,660కి పెరిగింది.
అగ్రస్థానంలో గుజరాత్‌
2023 మేలో రూ.2,000 నోట్లను కేంద్రం చలామణి నుంచి ఉపసంహరించింది. అప్పటి నుంచి బ్యాంకులు గుర్తించిన నకిలీ నోట్లలో రూ.2000 నోట్ల వాటా తగ్గిపోయింది. 2018-19లో బ్యాంకులు 22 వేల రూ.2,000 నోట్లను కనిపెడితే 2024-25లో ఆ సంఖ్య 3,508కి పడిపోయింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం రూ.6,017 కోట్ల విలువ కలిగిన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే నకిలీ నోట్ల స్వాధీనంలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉంది. గతంలో అగ్ర స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పుడు నకిలీ నోట్ల స్వాధీనాలు తగ్గిపోయాయి. అదే సమయంలో కర్నాటక, బీహార్‌లో పెరిగాయి. ఇటీవలి సంవత్సరాలలో నకిలీ నోట్ల స్వాధీనాలు పెరిగాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా చెబుతోంది. ఆర్‌బీఐ డేటా మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 2016-17లో బ్యాంకులు 7.62 లక్షల నకిలీ నోట్లను గుర్తించగా 2024-25లో ఆ సంఖ్య 2.17 లక్షలకు తగ్గిపోయింది. 2020లో మహారాష్ట్రలో అత్యధికంగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోగా ఆ తర్వాత గుజరాత్‌ అన్ని రాష్ట్రాలనూ దాటేసింది. ఒక్క 2022లోనే ఆ రాష్ట్రంలో 30 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad