– ప్రాణాలను రక్షించండి, గాజాలో శాంతిని పునరుద్ధరించండి
– ఇజ్రాయిల్‌పై , బయట పెరుగుతున్న ఒత్తిడి
బీజింగ్ : గాజాను పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయిల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలపడంపై విదేశాల్లోనూ, స్వదేశంలోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే గాజాలో ఇజ్రాయిల్ తన సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేస్తున్న ఈ సమయంలో పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని మరికొన్ని పాశ్చాత్య దేశాలు తమ ఉద్దేశ్యాన్ని ప్రకటించాయి. గాజాలో శాంతి కోసం పిలుపునిస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల నుంచి గాజాపై ఇజ్రాయిల్ దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 61 వేల మంది ప్రాణాలను కోల్పోయారు. తక్షణ కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజం పదేపదే పిలుపునిస్తున్నా.. భద్రతా మండలి తీర్మానాలు చేస్తున్నా.. విస్మరిస్తూ గాజాను స్వాధీనం చేసుకునే ప్రణాళికతోనే ఇజ్రాయిల్ ముందుకు సాగుతోంది. ఇజ్రాయిల్ ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా బలమైన వ్యతిరేకతకు దారితీసింది. 23 అరబ్, ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయిల్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయిల్ ఉల్లంఘించడాన్ని సంయుక్తంగా ఖండించాయి. బ్రిటన్, ఫ్రాన్స్, డెన్మార్క్, గ్రీస్, స్లోవేనియా దేశాలు కూడా ఇజ్రాయిల్ తన ప్రణాళికను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
అలాగే, మరోవైపు ఇజ్రాయిల్‌కు స్వదేశంలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గాజాపై దాడులను ముగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని టెల్ అవీవ్‌లో పదివేల మందికి పైగా ప్రదర్శన నిర్వహించారు. గాజా పాలస్తీనాకు చెందినదని, పాలస్తీనా భూభాగంలో గాజా అంతర్భాగమని తెలిపారు. బందీలను విడుదల చేయడానికి తక్షణ కాల్పుల విరమణ మాత్రమే సరైన మార్గమని తెలిపారు. మరోవైపు గాజాలో మానవతా సంక్షోభం దిగ్భ్రాంతికరమైన స్థాయిలకు చేరుకుంటుంది. కేవలం గత నెల జులైలోనే ఐదు, లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న దాదాపు 12 వేల మంది చిన్నారులు తీత్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైన తరువాత గాజాలో ఒక నెలలో గుర్తించిన ఇలాంటి చిన్నారుల సంఖ్యలో ఇదే అత్యధికం. అలాగే మే 27 నుంచి సహాయ పంపిణీ కేంద్రాల వద్ద సహాయం కోసం వేచిచూస్తున్న సమయంలో 1,600 మందికి పైగా మరణించారు. 12 వేల మందికి పైగా గాయపడ్డారు. సహాయ సామాగ్రి పంపిణీని ఆయుధాలుగా ఉపయోగించడం, ప్రజలను సామూహికంగా శిక్షించడం అంతర్జాతీయ మానవతా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమే.
తక్షణమే కాల్పుల విరమణ పాటించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES