Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపోలవరం నిర్వాసితుల సమస్యలు జాతీయ స్థాయికి

పోలవరం నిర్వాసితుల సమస్యలు జాతీయ స్థాయికి

- Advertisement -

చట్టసభల్లో ప్రస్తావించని టీడీపీ, వైసీపీ ఎంపీలు : జాన్‌ బ్రిట్టాస్‌
రామవరం బహిరంగ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ.బేబీ ప్రకటన
రాజమహేంద్రవరం :
పోలవరం నిర్వాసితుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లనున్నట్టు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ ప్రకటించారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు పోలవరం ముంపు, పునరావాస కాలనీల్లో సీపీఐ(ఎం) బృందం పర్యటించింది. స్థానికులతో మాట్లాడింది. వారిని చైతన్యపరిచింది. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం విఆర్‌.పురం మండలం రామవరంలో జరిగిన బహిరంగ సభలో బేబీ మాట్లాడారు. అంతకుముందు తమ గ్రామానికి వచ్చిన సీపీఐ(ఎం) బృందానికి స్థానిక మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడు తూ సమస్యల పరిష్కారంకోసం నిర్వాసితులు చేసే ప్రతి పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు ఇస్తుందని చెప్పారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని గత వైసీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని చెప్పారు.

నిర్వాసితుల పునరావాస కాలనీల్లో ఎక్కడ చూసినా నాసిరకం నిర్మాణాలే కనిపించాయన్నారు. వాటిని పూర్తి చేసి మూడు నాలుగేండ్లు గడవక ముందే వర్షం నీరు లీకవడంతో బరకాలు కట్టుకుని ప్రజలు కాపురాలు ఉంటున్న దృశ్యాలు తమకు కనిపించాయన్నారు. పోలవరం నిర్మాణానికి రూ.55 వేల కోట్లతో డీపీఆర్‌ రూపొందించగా కేంద్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందని, వాటిలో గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసానికి కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశాయన్నారు. వాటిలో అత్యధిక భాగం రాజకీయ పెద్దలు, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి లూటీ చేసినట్టు అర్ధమవుతోందన్నారు.
తక్షణమే దీనిపై విచారణ జరిపి అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు కనీసం ఉపాధి పనులైనా అన్ని గ్రామాల్లో కల్పించాలని కోరారు. పోలవరం, ఇతర పనులలో నిర్వాసితుల కుటుంబాలకు ఉపాధి చూపాలన్నారు. నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

రానున్న కాలంలో నిర్వాసితుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. సీపీఐ(ఎం) రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడుతూ పోలవరం నిర్వాసిత కాలనీలను సందర్శించి నిర్ఘాంత పోయినట్లు చెప్పారు. కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదన్నారు. నిర్వాసితుల సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి సారథ్యం వహిస్తున్న టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. కేరళలో నిర్మించిన పునరావాస కాలనీల్లో విద్యా, వైద్యం, రవాణా సౌకర్యాలతో పాటు కాలనీలో నివసించే ప్రజలకు ఉపాధి అవకాశాలను ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం కల్పించినట్టు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, నీళ్లు నిలిపి నిర్వాసితులను అనివార్యంగా వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని, పొమ్మనకుండా పొగబెట్టిన విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇటువంటి కుట్రలను సీపీఐ(ఎం) అనుమతించబోదన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, పోలవరం రెండు కళ్ళంటూ చేస్తున్న ప్రకటనలను గుర్తు చేశారు. పోలవరం అంటే ప్రాజెక్టు మాత్రమే కాదని, ఆ ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విఆర్‌.పురం మండలంలోని రామవరం గ్రామం అధికార యంత్రాంగం వేసిన కాంటూరు కాకి లెక్కలకు ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

ఆ గ్రామంలో 279 గృహాలు ఉంటే రోడ్డుకు ఒకవైపు ఉన్న 166 గృహాలకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారని వివరించారు. రోడ్డుకు మరోవైపు ముంపు ఉండదా ? అని ప్రశ్నించారు. పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా పునరావాస కాలనీలో నిర్వాసితులు జీవచ్ఛవంలా జీవిస్తున్నారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు నిర్వాసితులు పోరాటానికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) ఎఎస్‌ఆర్‌ రంప చోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలను సీపీఐ(ఎం) జాతీయ సమస్యలుగా గుర్తించిందని, రాబోయే రోజులలో నిర్వహించే పోరాటాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వాణిశ్రీ మాట్లాడారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తూ సీపీఐ(ఎం) బృందానికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, బలరాం పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad