నవతెలంగాణ-హైదరాబాద్: కరేడు గ్రామంలో సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను అదానీ కార్పొరేట్ సంస్థ ఇండోసోల్ పరిశ్రమ కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన బలవంత భూసేకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చలో కరేడు చేపట్టారు. దీంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో పాటు కరేడు ప్రజలను, రైతు, ప్రజా సంఘాల నాయకులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఇండోసోల్ చేపట్టిన భూముల దురాక్రమణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా అణచివేయాలని ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
మేము భూములు ఇవ్వం అని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కరేడు ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. బలవంతపు భూసేకరణ చేసి గ్రామాలకు గ్రామాలను తొలగించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో నేడు చలో కరేడు చేపట్టారని తెలిపారు. దీనిని పోలీసులు అణచివేయాలని చూస్తున్నారని, ఇది ఆమోదించదగిన కాదని తెలిపారు. భూసేకరణ ఎలా చేయకూడదో తెలిపేందుకు నిదర్శనం ఈ కరేడు భూసేకరణ అని తెలిపారు. ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్యలను ప్రజలు రాజకీయ పార్టీలకతీతంగా ఖండించాలని కోరారు.