నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగుల్ గావ్ గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షానికి పంటలు నీటిపాలయ్యాయని రైతులు తెలిపారు. రైతు వీరేశం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో వందలాది ఎకరాల్లో వరదనీరు వచ్చి చేరిందని అన్నారు. నీటితో పాటు సన్నటి నల్ల మట్టి తరలీ వచ్చి పంట పొలాలలో మేటలు వేసిందని తెలిపారు. సోయా, పత్తి కంది, మినిము, పెసర, పంటలతో పాటు మామిడి పంట ఇతర వాణిజ్య పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని రైతు పొలంలో విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ కింది భాగమంతా నీట మునిగి విద్యుత్ ట్రాన్స్ ఫారం వరకు వెళ్లలేని దుస్థితి నెలకొందని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలో ప్రవహిస్తున్న పెద్ద ఎడ్గి వాగునీటి ఉధృతిని పరిశీలించేందుకు జుక్కల్ ఆర్ఐ రామ్ పటేల్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం పంటపొలాలను పరిశీలించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప బయటకి తిరగకూడదని గ్రామస్తులకు సూచించారు. పంట నష్ట వివరాలను వర్షం నిలిచిన తర్వాత పరిశీలిస్తామని, నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు.