నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఇంటి ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆగ్రాలో ఉన్న నివాసప్రాంత ప్రాంగణంలో ప్లకార్డులతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..బీజేపీతో జత కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్న జ్ఞానేష్ కుమార్ ఆగ్రా వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈసీ ప్రధాన కమిషనర్ ఓట్ల చోర్ అని ప్లకార్డులపై పేర్కొన్నారు.
బీహార్ ఓట్ల చోరీ వ్యవహారంపై ఇండియా బ్లాక్ కూటమి తమ పోరాటాన్ని ఉధృతం చేసిన విషయం తెలిసిందే. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అదే విధంగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ పై చర్చ పెట్టాలని విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. ఈక్రమంలో ఆదివారం ఎన్నికల సంఘం బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియపై మీడియా సమావేశం నిర్వహించి.. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వాస్తవాలు కావని, ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారంలోపు క్షమాపణలు చెప్పాలని లేదా ఆఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పారు.