నవతెలంగాణ-గోవిందరావుపేట
భారత మాజీ ప్రధాని దివంగత నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భముగా కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కార్మికశాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భముగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ గారు 1944 ఆగస్టు 20 బోంబేలో జన్మించారు.
భారతదేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయన తాత ప్రధానమంత్రి అయ్యేనాటికి రాజీవ్ వయసు కేవలం 3 సంవత్సరాలు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్లమెంటు సభ్యుడు అయ్యారు. నిర్భయంగా కష్టపడి పనిచేసే పార్లమెంటేరియన్‌గా పేరు తెచ్చుకున్నారు.1980లో సోదరుడు సంజయ్‌గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితి మారింది. అప్పట్లో అంతర్గతంగా, బహిర్గతంగా అనేక సవాళ్ళు చుట్టుముట్టిన పరిస్థితుల్లో తల్లికి చేయూతను ఇవ్వడానికి రాజకీయాల్లో చేరవలసిందిగా రాజీవ్‌గాంధీపై వత్తిడి పెరిగింది. మొదట్లో వీటిని ప్రతిఘటించినప్పటికీ తరువాత తల వొగ్గక తప్పలేదు. తమ్ముని మృతి కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్‌గాంధీ గెలుపొందారు అని అన్నారు.
ఆధునిక భావాలు, నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజీవ్‌గాంధీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాని అని ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన ప్రధాన ఆశయాలలో భారత ఐక్యతను పరిరక్షిస్తూనే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళడం ముఖ్యమైనదని రాజీవ్ పదేపదే చెబుతూండేవారని అన్నారు. భారత దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాడని రాజీవ్ గాంధీ గారిని కొనియాడారు. 1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదుర్ ఎన్నికల ప్రచారంలో ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించాడు. యావత్ దేశం అభిమానించే రాజీవ్ గాంధీ చనిపోయిన నాటినుండి మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించబడింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, ఎస్.సి. సెల్ ములుగు జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి మండల బీసీ సెల్ అధ్యక్షులు కాడ బోయిన రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గణపాక సుధాకర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కనతల బుజ్జి, మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.