నవతెలంగాణ-హైదరాబాద్ : రొట్టెలు ఎందుకు చేయలేదని అడిగినందుకు ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్తతో మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో కత్తి తీసుకుని అతడి ఛాతీలో పొడిచింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, రాస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహవీర్ అఖాడా ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ (28) భోజనం కోసం ఇంటికి వచ్చాడు. అయితే ఇంట్లో పిండి అయిపోవడంతో, అతని భార్య ముగ్గురు పిల్లలతో పాటు భర్తకు కూడా కిచిడీ వండిపెట్టింది. కానీ తనకు రోటీలే కావాలని సంజయ్ పట్టుబట్టడంతో దంపతుల మధ్య వాగ్వాదం మొదలైంది.
ఈ క్రమంలో సహనం కోల్పోయిన భార్య, వంటగదిలోని కత్తి తీసుకుని సంజయ్ ఛాతీపై దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని, సంజయ్‌ను స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు.
ఈ ఘటనపై తమకు ఇంతవరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.