నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ప్రవేశాలను పెంచే దిశగా జిల్లాలో చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ప్రవేశాల లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి క్రమం తప్పకుండా పర్యవేక్షించి సమర్థవంతమైన యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అన్ని వయసు వర్గాల వారికి విద్యా అవకాశాలు అందించడంలో, జిల్లాలో అక్షరాస్యత పెంపులో టాస్ ప్రవేశాల విస్తరణ కీలకమని అన్నారు. ముఖ్యంగా పాఠశాల మానేసిన (డ్రాప్‌అవుట్) విద్యార్థులకు టాస్ ద్వారా మళ్లీ చదువు కొనసాగించే ప్రత్యేక అవకాశం లభిస్తుందని తెలిపారు.