తురుమెళ్ళ కళ్యాణి… ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, విద్యావేత్త, ఉపాధ్యాయిని, రేడియో వ్యాఖ్యాత, ఈవెంట్ ఆర్గనైజర్, మోటివేషనల్ స్పీకర్, సమాజ సేవా తత్పరురాలు.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాను స్వయంగా రచయనలు చేయడమే కాకుండా విద్యార్థుల్లోనూ సాహిత్య అభిలాష పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఓ రచయితగానే కాక సమాజ సేవలోనూ ముందు భాగంలో ఉండే ఆమె పరిచయం నేటి మానవిలో…
తురుమెళ్ళ కళ్యాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లిలో పుట్టారు. తల్లిదండ్రులు తురుమెళ్ళ రమా కనకలక్ష్మి, శంకరరావు. వీరికున్న ఐదుగురు సంతానంలో కణ్యాణి అందరికంటే చిన్నవారు. 1980 మే 5న జన్మించారు. ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించు మధ్యమ నుండి రాష్ట్ర భాష ప్రవీణ వరకు అన్ని పరీక్షల్లో ఈమె ఉత్తీర్ణత సాధించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి హిందీ ప్రేమీ మండలి మహా విద్యాలయంలో సీటు సంపాదించి పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసారు. అంబేడ్కర్ యూనివర్శిటీ నుండి డిగ్రీ, ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎం.ఏ హిందీ పూర్తి చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బిఎల్‌ఐ ఎస్సీ (లైబ్రరీ సైన్స్) పట్టా పొందారు. ఆకాశవాణి-ముంబయి కేంద్రం వారి వాణి కోర్స్ పట్టా కూడా పొందారు.
ఉపాధ్యాయినిగా…
కళ్యాణికి చిన్నతనం నుండి పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. అలాగే సంగీతం వినడం, పాటలు పాడడం, సమాజంలోని విభిన్న అంశాలపై కవితలు రాయడం, కథలు, కథానికలు, నాటికలు రాయడం, సమాజ సేవ చేయడం, అన్నార్తులను, అభాగ్యులను ఆదుకోవడం వీరికి ఎంతో ఇష్టం. హిందీ ఉపాధ్యాయినిగా చర్ల మండలం జెడ్.పీ.హెచ్.ఎస్ తేగడలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నందు 16 ఏండ్లుగా క్యాజువల్ రేడియో అనౌన్సర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
సాహితీ ప్రస్థానం
కవితలు, కథలు, కథానికలు రాసే కళ్యాణి ఉపాధ్యాయురాలిగా తన విద్యార్థుల కోసం చిన్న చిన్న నాటికలు తయారు చేసేవారు. సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే వాక్చాతుర్యం ఉన్న ఆమె తన పాఠశాలతో పాటు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. అంతేకాదు జిల్లా స్థాయిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రధాన వ్యాఖ్యాతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అందరికీ తలలో నాలుకగా మెలిగారు. వివిధ అంశాలపై కవితలు రాస్తున్న కళ్యాణి ‘కలం సహస్ర కవిమిత్ర’ అనే వాట్సాప్ సమూహం ద్వారా పలువురికి జాతీయ స్థాయిలో పరిచయమయ్యారు. కోవిడ్ లాక్ డౌన్ కాలంలో ఆమె రచన మరింత ఊపందుకుంది. గౌతమేశ్వర, A×ఖ×A, సాయి వనంలో సాహిత్యం, వాల్మికి సాహిత్య సంస్థ, తెలంగాణ సారస్వత పరిషత్తు(ప్రభుత్వ), భద్రాద్రి జిల్లా కవిత్వం (ప్రభుత్వ) వంటి పలు సంస్థల ద్వారా వెలువడిన దాదాపు 20 పుస్తక సంకలనాలలో వీరి కవితలు ప్రచురింపబడ్డాయి.
ముద్రిత పుస్తకం
‘కలం నా గళం’ అనే కవితా సంపుటిని కళ్యాణి రవీంద్రభారతితో వెలువరించారు. వీరి కవితలు, కథలు వివిధ ప్రముఖ దినపత్రికలలో తరచూ ముద్రింపబడుతూనే ఉన్నాయి. వ్యక్తిత్వ వికాస వ్యాసాలు, కవితలు కూడా ప్రముఖ ఆన్లైన్ దినపత్రికలలో ప్రచురింపబడతున్నాయి. ‘దిశ’ దినపత్రిక వారు నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలో ఆమె రాసిన ‘గురుదక్షిణ’ అనే కథకు తృతీయ బహుమతి పొందారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తానా వారు ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో 74 మంది సాహితీ దిగ్గజాలతో జూమ్ వేదికగా నిర్వహించిన కవిసమ్మేళనంలో మన దేశం నుండి కళ్యాణి కూడా పాల్గొన్నారు. కవితాగానం చేసి ప్రముఖుల ప్రశంసలు పొందారు. సేవ సాహితీ సంస్థ వారు నిర్వహించిన జాతీయ స్థాయి కవి సమ్మేళనంలో ప్రయోక్తగా వ్యవహరించి గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ వంటి ప్రముఖులతో ప్రశంసలు పొందారు. ‘అంతర్జాతీయ సేవా సాహితీ సప్తాహం’లో మలేషియా బాల కవి సమ్మేళనానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి అంతర్జాతీయ స్థాయిలో సాహితీ అర్చన గావించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు వారు బాలలకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 3 రోజుల వర్క్ షాప్‌లో కథా, కవితా ట్రైనర్‌గా వ్యవహించారు. తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సైతం రచనలు చేశారు. జాతీయస్థాయిలో 80 మంది కవులతో వెలువడిన హిందీ పుస్తక సంకలనం ‘స్వతంత్ర భారత్ కా అమృతోత్సవ్’లో వీరి కవిత కూడా ప్రచురించబడింది.
వివిధ పోటీల్లో విజేతగా…
ప్రభుత్వం వారు ‘నేను నా వృత్తిని ప్రేమిస్తున్నాను’ అనే అంశంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచారు కళ్యాణి. ప్రభుత్వం వారిచే నిర్వహించిన జిల్లా స్థాయి కవితాపఠన పోటీల్లో పలుమార్లు విజేతగా నిలిచారు. వాట్సాప్ వేదికగా పలు సాహితీ సంస్థలు నిర్వహించే పోటీల్లో తరచూ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందుతూ కొన్ని సంస్థలకు అడ్మిన్‌గా వ్యవహరించి ఉత్తమ సమీక్షా ధురీణగా, అంత్యప్రాస రచయిత్రిగా బిరుదులు పొందారు. ప్రస్తుతం విమల సాహితి ఆన్లైన్ పత్రిక సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు.
పురస్కారాలు, సత్కారాలు
2024లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన 20 మంది ప్రముఖుల జాబితాలో 5 గురు ప్రముఖ కవుల్లో కళ్యాణి కూడా స్థానం పొందారు. బెస్ట్ మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ వుమెన్ ఫర్ ద డిస్ట్రిక్ట్ -2021, కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ కమెంటేటర్‌గా వరుసగా 5 ఏండ్లు పురస్కారాలు అందుకున్నారు. అలాగే వల్లూరి ఫౌండేషన్ అవార్డు, కవిరత్న, కవన రత్న, విద్యాదాత – 2021, గిడుగు రామమూర్తి పంతులు జాతీయ సాహిత్య పురస్కారం-2025, అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 నాడు ‘నేషనల్ లెజెండరీ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్నారు.
– అచ్యుతుని రాజ్యశ్రీ
బహుముఖ ప్రజ్ఞాశాలి కళ్యాణి
- Advertisement -
- Advertisement -