రైతుల కోసం ప్రభుత్వాలు చాలా మాట్లాడతాయి. చేతలకొచ్చేసరికి శూన్యహస్తాలే దర్శనమిస్తాయి. మొన్న స్వాతంత్య్ర దినోత్సవాన మన ప్రధాని.. రైతుల కోసం నేనున్నానని మాట్లాడారు. బాగానే ఉంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా సైతం అందించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతులు వర్షాలకు తడుస్తూనే పొద్దంతా యూరియా బస్తాలకోసం పడిగాపులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రాష్ట్ర రైతులకు 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 5.32 లక్షల టన్నులే వచ్చింది. రైతులకు ఏ సమస్యా లేకుండా చూస్తున్నామన్న ప్రభుత్వం మాత్రం సమయానికి కావలసిన యూరియా అందించ లేకపోతున్నది. పల్లెల్లో రైతులు యూరియా రామచంద్రా! అని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు తప్ప, ఒత్తిడిచేసి సాధించలేకపోతున్నారు. ఎన్నిసార్లు అడిగినా, చేస్తాం చూస్తాం అంటున్నది కేంద్రం. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నప్పటికీ, ఇక్కడి రైతుల యెతలు పట్టించుకోవడమేలేదు. వీళ్లంతా ఏంచేస్తున్నట్టు? రైతుల బాధలు తీర్చడంలో బాధ్యత లేదా! ఇంకా ఎప్పుడు కదులుతారు!
జనంగోస వినండి
వారం రోజులుగా వానలు పడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. వీధులు మునుగుతున్నాయి. నగరాలలోనూ వర్షపు వరదతో ఇక్కట్లు పడుతున్నారు జనం. ముఖ్యంగా పూరి గుడిసెల్లో, షెడ్లక్రింద జీవించే పేద ప్రజలు, సరైన గూడులేక తడిసి ముద్దవుతున్న జనం అనేక బాధలు పడుతున్నారు. జీవనోపాధీ లేకుండా పోతున్నది. రోడ్లు తెగాయి. దారులన్నీ అస్తవ్యస్తమయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ, ఆదివాసీ గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో వైద్యం అందుబాటులో లేదు. అనేక మైళ్లు నడిచిపోవాల్సి వస్తోంది. దోమలు పెరిగిపోయి, తిరిగి డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. పల్లెల్లో అందించాల్సిన వైద్య సేవల గురించి, సౌకర్యాల గురించి ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టటంతోను, రసాయనాలు, మందులు, కాలుష్యం పెరిగి వాతావరణమంతా వ్యాధుల కారకంగా మారుతున్నది. వెంటనే ప్రజలకు అనారోగ్య సమస్యలు, వరద విపత్తులు వస్తున్న కాలంలో ప్రభుత్వం పట్టించుకోవాలి!
ఎంతకాలం వేచి చూస్తారు?
రాష్ట్రంలోని ఉపాధ్యాయలోకం ఉద్యమబాట పట్టింది. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు దాటింది. గెలిస్తే పరిష్కరిస్తామని, మ్యానిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు ఒక్కటి కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. ఎన్నోసార్లు ఉపాధ్యాయులు విన్నవించుకున్నారు. గత ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన ఐదు కరువు భత్యం కిస్తీలను, కొత్త ప్రభుత్వం ఇస్తుందని ఆశపడ్డారు. కానీ ఒక్కటిచ్చి, గత ప్రభుత్వం మాదిరే దాటవేస్తున్నది. ఇక ఆర్థిక కేటాయింపులు అవసరంలేని, అనేక సమస్యలు అలాగే అలానే మూలుగుతున్నాయి. ఏ ఒక్కటి పరిష్కారం చేసే వైపు అసలు ప్రయత్నమే జరగటంలేదు. ఉపాధ్యాయులు దాచుకున్న జీపిఎఫ్‌ను కూడా చెల్లించలేకపోతున్నది. అనారోగ్యానికి చికిత్స చేయించుకున్నవారి వైద్య ఖర్చుల చెల్లింపులూ లేవు. పదవీ విరమణ పొందిన వారికి అందాల్సిన బెనిఫిట్స్ రాక, చాలామంది ఉద్యోగులు మానసిక ఆందోళన చెందుతున్నారు. జిల్లా విద్యాధికారులు, మండల విద్యాధికారుల ఖాళీలు నింపడంలేదు. రాష్ట్రంలో 5,571 ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేయలేదు. హెల్త్ కార్డుల గురించి చర్చలు చేశారు. కానీ ఒక్క అడుగూ ముందుకుపడలేదు. బకాయిలు చెల్లించడం దశల వారీ చేస్తామన్నా, ఇంకా జరగడంలేదు. ఇంకా విద్యావ్యవస్థకు సంబంధించిన సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గత ప్రభుత్వమూ అంతే చేసింది. ఉద్యోగులంతా నిరీక్షించి అసహనంతో ఉన్నారు. వాళ్లంతా ఉద్యమించేందుకు సన్నాహం చేస్తున్నారు. ఉద్యోగులపట్ల నిర్లక్ష్యం ప్రభుత్వాలకు పనికిరాదు. ప్రభుత్వమా ఇప్పటికైనా పట్టించుకో !
అవార్డులు సరే!
సినిమాలకు, నాయికా నాయకులకు, సాంకేతిక వర్గానికి గద్దర్ పేరుమీద అవార్డులు, రివార్డులు ఇచ్చారు బాగానే ఉంది. కోట్లాది రూపాయలను రివార్డులుగానూ ఇస్తున్నారు. ఇవ్వండి. పరిశ్రమను పోత్సహించడం బాగానే ఉంది. కానీ ఈ సినిమా పరిశ్రమలోనే వందలాది మంది కార్మికులు, రోజు కూలీలుగా పనిచేస్తున్న వారి వేతనాలు పెంచమని అడుగుతుంటే, పెరిగిన ధరలకనుగుణంగా వేతనం పెరగాలని డిమాండ్ చేస్తున్న కార్మికుల విషయాలను ప్రభుత్వం వినదా! ప్రభుత్వం కలుగ చేసుకుని వారి సమస్యలూ పరిష్కరించాలి కదా! సినిమాను నిర్మించిన వారికి, హీరోలకు స్పెషల్ షోలకు, టికెట్ల ధరలు పెంచుకోవటానికి ప్రత్యేక జీవోలిచ్చి అనుమతించే ప్రభుత్వం, ఆ పరిశ్రమల కార్మికుల గురించి కూడా పటించుకోవాలి కదా! సినిమా కార్మికులే కాదు, నిత్యం పనులు చేసే ఆశాల, అంగన్వాడీల, పరిశ్రమల కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కనీస వేతనాలూ అమలు చేయడం లేదు. సామాన్యుల గోడు పట్టదా ప్రభుత్వానికి!
విగ్రహాలేనా?
అతి సామాన్య, వెనుకబడిన వర్గానికి చెందినవాడు సర్వాయి పాపన్న. ఆనాటి జమిందారుల, దొరల ఆగడాలను ఎదిరించి, తానే సైన్యాన్ని నిర్మించుకొని గోల్కొండ కోటపైకి దండెత్తిన వీరుడిగా పాపన్నకు పేరున్నది. అలాంటి వీరుడి ధైర్య సాహసాలు రానున్న తరానికి తెలిపేందుకు సర్వాయి పాపన్న విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మంచిదే. కానీ అదే సర్వాయి పాపన్న సామాజిక వర్గమయిన కల్లు గీత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వృత్తిలో ఉన్న వేలాది మంది జీవితాలు అభద్రతలో కొట్టుమిట్టాడు తున్నాయి. చెట్లెక్కి మృత్యువాత పడుతున్నవారికి బీమా సౌకర్యంలేదు. అందించే సహాయమూలేదు. వృత్తి తప్ప వేరే ఉపాధి లేని కుటుంబాల జీవనమూ ఇక్కట్లతో సాగుతున్నది. వారి సంక్షేమాన్ని గురించి, వృత్తి అభివృద్ధి గురించి ఏమీ ఆలోచించకుండా, వారికి ప్రతీకగా ఉన్న సర్వాయి పాపన్న విగ్రహంతోనే వీరిలో ఎదుగుదల చూడగలుగుతామా! సాంస్కృతికపరమైన, చారిత్రక సంకేతాలను తీసుకుని ఉత్సవాలో, విగ్రహాలో ముందుకు తెచ్చి నేటి ప్రజలకు వైభవ భ్రమను కలిగించటమే గత కొంతకాలంగా రాజకీయ పక్షాలు చేస్తున్న పని. బతు కమ్మను కూడా ప్రభుత్వం నిర్వహించి సాంస్కృతిక వారసత్వానికి తామే నిజమైన అర్హులమని చెప్పుకొంది. కానీ ఆడపిల్లల వివక్షతకు, భద్రతకు, విద్యకు, ఉపాధికి సంబంధించిన విషయాలను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆడపిల్లలపై దాడులు, హింస సాగుతూనే ఉంది. ఉత్సావాలు చేయండి, విగ్రహాలు పెట్టండి. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించండి.
కె.ఆనందాచారి
9948787660