తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
పీఎం, సీఎం, మంత్రుల ఉద్వాసన బిల్లులు జేపీసీకి
సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట
ప్రతిపక్ష మహిళ ఎంపీలను నెట్టేసిన కేంద్రమంత్రులు
లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్, రాజ్యసభలో ఐఐఎం బిల్లులు ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే 31వ రోజే పీఎం, సీఎం, మంత్రుల పదవులు పోయేలా వీలు కల్పించే మూడు రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టే సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఈ బిల్లులను ప్రనతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షపాలిత రాష్ట్రాలను కూలదోసే కుట్రలో భాగంగానే ఈ బిల్లును మోడీ సర్కారు తీసుకొస్తున్నదని ఆరోపించాయి. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల నడుమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వీటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి సిఫారసు చేస్తూ తీర్మానం చేశారు. వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ వ్యతిరేక బిల్లులంటూ, అవి ప్రతిపక్షాలపై కక్షపూరిత చర్యలకు ఉద్దేశించినవని ప్రతిపక్ష సభ్యులు బిల్లు కాపీలను చించి విసిరేశారు. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా ఎంపీలను కేంద్రమంత్రులు నెట్టేవేశారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విమర్శించారు.బుధవారం లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. వెంటనే ప్రతిపక్ష సభ్యులు బీహర్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను వెనక్కి తీసుకోవాలని వెల్‌లోకి దూసుకెళ్లి, ప్లకార్డులు చేబూని ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే సభను వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో తమ ఆందోళనను కొనసాగించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టబోయే మూడు రాజ్యాంగ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్యే అమిత్ షా కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు, రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులన ప్రవేశపెట్టారు. దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నేతలు కెసి వేణుగోపాల్, మనీశ్ తివారీ, ఆరెస్పీ నేత ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసి, ఎస్‌పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఈ మూడు బిల్లులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. బిల్లులను జేపీసీ, లేదంటే సెలక్ట్ కమిటీకి పంపాలని సూచించారు.మరోవైపు ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. బిల్లుల కాపీలను చించివేసి, కాగితపు ముక్కలను విసిరేశారు. అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోకి భారీగా మార్షల్స్‌ను దింపారు. అయితే ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంత మందిని మార్షల్స్‌ను వెనక్కి పంపించేశారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభలో తీవ్రమైన గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీటు ముందు ముగ్గురు మార్షల్స్‌ను పెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్యే బిల్లులను ప్రవేశపెట్టి, మూజువాణి ఓటుతో ఆమోదించారు. అలాగే ఈ బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా జేపీసీకి సిఫారసు చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సభలోని 21 మంది సభ్యులను లోక్‌సభ స్పీకర్ జేపీసీకి నామినేట్ చేయనున్నారు. రాజ్యసభలో 10 మంది సభ్యులను డిప్యూటీ చైర్మెన్ నామినేట్ చేయనున్నారు. సభలో ఉద్రిక్తతల నేపథ్యంలో సభను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించారు. మరోవైపు రాజ్యసభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాల హోరెత్తించారు. దీంతో రాజ్యసభ కూడా వాయిదాల పర్వం తొక్కింది. అనంతరం ఐఐఎం బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.
పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు : విపక్షాల ఆరోపణ
కేంద్రం హడావిడిగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్య వాదానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశాన్ని బీజేపీ పోలీసు రాజ్యంగా మారుస్తున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ ఇది క్రూరమైన చట్టమని అన్నారు. అవినీతి వ్యతిరేక చర్య అని చెబుతూనే తీవ్రమైన చట్టాన్ని రూపొందించినట్టు ఆమె ఆరోపించారు. సీఎంపై ఏదైనా కేసును పెట్టి, ఆయనను 30 రోజుల పాటు అరెస్టు చేసి, సీఎం పదవి నుంచి తొలగిస్తారని ఆమె ఆరోపించారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని, అప్రజాస్వామికమని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టడం దురదృష్టకరమని తెలిపారు. గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్టయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ లేవనెత్తారు. అమిత్ షా అరెస్టయిన సందర్భంలో నైతికత ప్రదర్శించారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ.. దేశాన్ని ఓ పోలీస్ స్టేట్‌గా బీజేపీ మారుస్తోందన్నారు. ప్రధానమంత్రిని ఎవరు అరెస్టు చేస్తారని, ఈ బిల్లులతో దేశాన్ని పోలీసు రాజ్యంగా బీజేపీ మారుస్తున్నదని ఆయన ఆరోపించారు. ఆ బిల్లులను వ్యతిరేకిస్తామని, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని బీజేపీ విస్మరిస్తోందని ఒవైసీ అన్నారు.
మహిళా ఎంపీలను కేంద్ర మంత్రులు నెట్టారు: కళ్యాణ్ బెనర్జీ
కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్ బిట్టు, కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా ఎంపీలను వెల్‌లోకి తోశారని టీఎంపీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విమర్శించారు. ”కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్ బిట్టు, కిరణ్ రిజిజు ఇద్దరు మహిళా ఎంపీలను వెల్‌లోకి తోశారు. బీజేపీ మహిళలపై దారుణాలకు పాల్పడుతోంది” అని అన్నారు.
లోక్‌సభలో మూడువివాదాస్పద బిల్లులు
- Advertisement -
- Advertisement -