ముడుపుల కేసు నుంచి బయటపడేందుకు ముమ్మర ప్రయత్నాలు
న్యాయ సంస్థలకు వేలాది డాలర్ల ఫీజు చెల్ల్లింపు
ప్రభుత్వ శాఖలు, శ్వేతసౌధం కూడా లక్ష్యాలే
న్యూఢిల్లీ : అమెరికా న్యాయస్థానంలో ముడుపుల కేసును ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ దాని నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తోంది. ఇందుకోసం తాజాగా పేరున్న రెండు లాబీయింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారత్‌లో ఇంధన కాంట్రాక్టులు దక్కించు కోవడానికి పెద్ద ఎత్తున ముడుపులు అందజేశారంటూ 2024 నవంబర్ 20న అమెరికా న్యాయ శాఖ ఓ అభియోగ పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై ప్రస్తుతం కేసు నడుస్తున్న నేపథ్యంలో దాని నుంచి తప్పించుకునేందుకు అదానీ గ్రూప్ ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే తాజాగా రెండు లాబీయింగ్ సంస్థలను రంగంలోకి దింపింది.
2023లోనే మొదలైన ప్రయత్నాలు
తనపై మోపిన ఆరోపణల్ని అదానీ గ్రూప్ తోసిపుచ్చుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. అయినప్పటికీ 2023లోనే లాబీయింగ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే వాటిపై అప్పుడు పెద్దగా దృష్టి సారించలేదు. వ్యాపార లక్ష్యాలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ ఏడాది లాబీయింగ్‌కు అయిన మొత్తం ఖర్చు 40,000 డాలర్లు మాత్రమే. అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అదానీ సోలార్ యూఎస్‌ఏ వ్యవహారాలు నడిపింది. అప్పుడు దాని తరఫున ఒకే ఒక రిజిస్టర్డ్ లాబీయిస్ట్ అనురాగ్ వర్మ ఉండేవారు. వాణిజ్య, విదేశాంగ శాఖలతోనూ, ఎక్స్‌పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ యూఎస్‌తోనూ, జాతీయ భద్రతా మండలితోనూ, ఓవర్‌సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌తోనూ…ఇలా ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరపాలని అదానీ గ్రూప్ అప్పుడు యోచించింది.
పెరుగుతున్న లాబీయిస్టులు…ఖర్చులు
లాబీయింగ్ వ్యవహారాలలో అనురాగ్ వర్మకు మంచి అనుభవం ఉంది. 1990వ దశకం నుంచి భారతీయులు, భారతీయ అమెరికన్లతో పాటు భారత ప్రభుత్వం కూడా వాషింగ్టన్‌లో తమ తరఫున పనులు చక్కబెట్టేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటున్నాయి. తనపై అభియో గాలు నమోదైన మరునాడే అకిన్ గంప్ స్ట్రాస్ హౌర్ అండ్ ఫెల్డ్ అనే న్యాయ, లాబీయింగ్ సంస్థను అదానీ నియమించుకున్నారు. కంపెనీ ఎదుర్కొంటున్న న్యాయపరమైన సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ సంస్థ రంగంలోకి దిగింది. ఆ తర్వాత అదానీ తరఫున లాబీయింగ్ చేస్తున్న బృందంలో ఐదుగురు సభ్యులు చేరారు. ఈ బృందంలో కాంగ్రెస్ మాజీ సభ్యురాలు ఇలియానా రోస్-లెహ్టినెన్ కూడా ఉన్నారు. గత సంవత్సరం ఈ బృందానికి అయిన మొత్తం ఖర్చు 70,000 డాలర్లకు చేరింది. అకిన్ గంప్‌కు అదనంగా మరో 20,000 డాలర్లు చెల్లించారు. లాబీయింగ్ చేయాల్సిన లక్ష్యాలలో తాజాగా శ్వేతసౌధం కూడా చేయడం గమనార్హం.
ఈ సంవత్సరం ప్రథమార్ధంలో లాబీయింగ్ ఖర్చులు బాగా పెరిగాయి. ప్రముఖ లీగల్ డిఫెన్స్ సంస్థలైన కిర్క్‌లాండ్ అండ్ ఎల్లిస్ ఎల్‌ఎల్‌పీ, క్విన్ ఎమ్మాన్యుయేల్ ఉర్కుహార్ట్ అండ్ సల్లివాన్ ఎల్‌ఎల్‌పీని రంగంలోకి దించారు. దీంతో ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలోనే లాబీయింగ్ ఖర్చులు 1,50,000 డాలర్లకు చేరాయి. గత సంవత్సరం మొత్తంలో చేసిన ఖర్చుతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువే. ఇప్పుడు లాబీయిస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీపైనే వీరంతా దృష్టి సారించారు. జనవరిలో ఈ కంపెనీ సొంతంగా అమెరికాలో అత్యంత శక్తివంతమైన రెండు లాబీయింగ్ సంస్థలను నియమించుకుంది. విదేశాంగ శాఖలో పనులు చక్కబెట్టేందుకు కొత్తగా నియమించబడిన లీగల్ బృందాలు ప్రయత్నిస్తాయి. ముడుపుల ఆరోపణల్లో విదేశీ అధికారుల ప్రమేయం ఉండడం, ఈ కేసుకు అంతర్జాతీయ స్వభావం ఉండడంతో ఇప్పుడు వాటి దృష్టి అంతా విదేశాంగ శాఖ పైనే నిలిచింది. ఏదేమైనా కేసు నుంచి బయటపడేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న లాబీయింగ్ ఖర్చు ప్రతి ఏడూ పెరుగుతూ వస్తోంది. లాబీయిస్టుల సంఖ్యను కూడా పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగిన పేరున్న న్యాయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నారు. దేశాధ్యక్షుడి మాజీ డిప్యూటీ కౌన్సిల్, అధ్యక్షుని మాజీ స్పెషల్ కౌన్సిల్, మాజీ డిప్యూటీ స్టాఫ్ సెక్రటరీలతో సంబంధాలున్న వ్యక్తిని ప్రధాన లాబీయిస్టుగా నియమించారంటేనే అదానీ గ్రూప్ ఎత్తుగడలు ఏమిటో అర్థమవుతాయి. క్రిమినల్ వ్యవహారాలలో లాబీయింగ్ చేసే నిపుణులు కూడా లాబీయిస్టుల బృందంలో సభ్యులుగా ఉన్నారు.
అమెరికాలో అదానీ లాబీయింగ్
- Advertisement -
- Advertisement -