భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం
3వ హెచ్చరికకు చేరువలో రామన్నగూడెం పుష్కరఘాట్
కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ఏజెన్సీ మండలాలకు నిలిచిపోతున్న రాకపోకలు
అప్రమత్తమైన అధికారులు.. కలెక్టర్ల పరిశీలన
ఎగువ మానేరు ప్రాజెక్టుకు నీటి విడుదల
నవతెలంగాణ- భద్రాచలం/ఏటూరునాగారం ఐటిడిఏ/ మహాదేవపూర్/గంభీరావుపేట
ఉపనదులు ఉప్పొంగి భారీగా వరద నీరు గోదావరిలో చేరడంతో ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద బుధవారం రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉండగా, కాళేవ్వరం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
భద్రాచలంలో లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు ముంపు మండల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎగువ ప్రాజెక్టులు అయిన కడెం, శ్రీరాంసాగర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతూ బుధవారం మధ్యాహ్నానికే మొదటి ప్రమాద హెచ్చరికను దాటి రాత్రికి ఉధృతమైంది. రెండో ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో సుమారు 12 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్, అయ్యప్ప కాలనీ, రామాలయం కొత్త కాలనీల వద్ద స్లూయిజ్‌లను ఇరిగేషన్ అధికారులు నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రామాలయం స్లూయిజ్‌ల వద్ద అధికారులు ఇసుక బస్తాలను తరలించి జంబో మోటార్లను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి నీటిమట్టం మరో ఐదు అడుగుల పెరిగితే తుది హెచ్చరికను సైతం జారీ చేయనున్నారు. భద్రాచలం నుంచి ఏజెన్సీ మండలాలకు వెళ్లే రహదారులపై గోదావరి నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. చర్లకు వెళ్లే జాతీయ రహదారి తూరుబాక వద్ద నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలం-కూనవరం వెళ్లే రహదారి సైతం మురుమూరు వద్ద ముంపుకు గురికావడంతో అటువైపు వెళ్లే వాహనాలను నిలిపేశారు. ఎటపాక మండలం వెంకటరెడ్డిపేట, వీరాపురం గ్రామాల మధ్య రహదారిపైకి వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుకునూరు-బూర్గంపాడు రహదారి ముంపునకు గురికావడంతో వాహనాలను నిలిపివేశారు.
ములుగులో గోదావరి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు వరద నీరు రెండో ప్రమాద హెచ్చరికను దాటి 16.110 మీటర్ల వేగంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. 17.32 మీటర్లకు చేరితే అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్టు తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, పోలీస్ శాఖలు అప్రమత్తమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాలైన ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడ మానసపెళ్లి ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రమైన గిరిజన భవన్‌కు తరలిస్తున్నారు. రామన్నగూడెం, రామ్‌నగర్ ప్రాంతాల్లోని ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.
సిద్ధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
గోదావరి పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి ఏటూరునాగారంలోని ఓడవాడ మానసపెళ్లి, రామన్నగూడెం పుష్కరఘాట్, రాంనగర్‌లోని ఆయా ప్రాంతాల్లో బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆయా శాఖల అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడూ వరద ఉధృతిని అంచనా వేస్తూ ప్రజలను తరలించడానికి వాహనాలను సిద్ధం చేస్తున్నారు.
మునకకు చేరువలో జ్ఞాన సరస్వతీ దీపం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. మండలంలోని కాళేశ్వరంలో గోదావరి, సరస్వతి ఘాట్ల వద్ద వరద ఉధృతిని ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఉదయం 7 గంటలకు సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. గోదావరి 12.220 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు. నది పరివాహక గ్రామాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎస్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అత్యవసర సేవల కోసం కలెక్టరేట్‌లో 9030632608 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. అనంతరం అన్నారం రహదారిలో చండ్రుపల్లి వద్ద కాజ్‌వేపై వరదను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద బుధవారం సాయంత్రం 10 లక్షల 43 వేల 840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 85 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం వద్ద రెండో ప్రమాదం హెచ్చరిక జారీ చేయనున్నట్టు కలెక్టర్ చెప్పారు. వీఐపీ పుష్కరఘాట్ వద్ద జ్ఞాన సరస్వతి మునగడానికి చేరువలో ఉంది. బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సందర్శించి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వెంట జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ రామారావు, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో రవీంద్రనాథ్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు ఉన్నారు.
ఎగువ మానేరు నుంచి నీటి విడుదల
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బిగితే నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అప్పర్ మానేరు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 9,500 క్యూసెక్కులు రావడంతో అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కిశోర్, డీఈ నర్సింగం, డీవీహెచ్‌ఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ పాల్గొన్నారు.
విలీన మండలాలకు ముంపు ముప్పు
పోలవరం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎట్టపాక మండలాలకు ఇటు గోదావరి వరదకు తోడు శబరిపోటుతో ముంపు ముంచుకొస్తోంది. ఇప్పటికే చింతూరు వద్ద శబరి 34 అడుగులకు చేరుకొని ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. చింతూరు -చట్టి మధ్య జాతీయ రహదారి ముంపునకు గురవ్వడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. వీఆర్ పురం మండలంలో అనేక ఏజెన్సీ గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి రెండో ప్రమాద హెచ్చరికల నేపథ్యం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ కోరారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేయటానికి పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. 24 గంటలపాటు అందుబాటులో ఉండే ఈ కంట్రోల్ రూమ్‌ని లోతట్టు ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరదల నేపథ్యంలో ప్రజలకు ఏ అవసరం ఉన్నా 799 526 8352 సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు 798 1219425 నెంబర్లను సంప్రదించాలని చెప్పారు.
గోదారమ్మ ఉగ్రరూపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES