ఇందుకు ఒక మెకానిజాన్ని రూపొందించాలి
బీమా పాలసీలపై పన్ను
మినహాయింపు ప్రతిపాదనకు మద్దతు
జీఓఎం సమావేశాల్లో
రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
న్యూఢిల్లీ : జీఎస్టీ తగ్గింపు, మినహాయింపు ప్రయోజనాలు వినియోగదారులకే అందాలని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తెలిపారు. వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీని మినహాయించే కేంద్రం ప్రతిపాదనను వారు ఆహ్వానించారు. ఈ మేరకు తమ మద్దతును తెలిపారు.. న్యూఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ పరిహార సెస్సు, ఆరోగ్యం, జీవిత బీమా, రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (జీఓఎం) సమావేశాల్లో ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొని తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చేశారు. కేంద్రం జీఎస్టీ సంస్కరణల ప్రతిపాదనలపై చర్చించటానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రులు, పలు రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఆరోగ్యం, జీవిత బీమాపై జీఓఎం సమావేశం అనంతరం ప్యానెల్ కన్వీనర్ బీహార్ ఉపముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై ట్యాక్స్ రేటును తగ్గించే కేంద్ర ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాలూ ఆమోదం తెలిపాయన్నారు. దీనికి సంబంధించిన నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు అందిస్తామన్నారు. ట్యాక్స్ రేట్లపై తుది నిర్ణయాన్ని కౌన్సిల్ తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం హెల్త్, ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ ఉన్నది. 2023-24లో ఆరోగ్య బీమా మీద జీఎస్టీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.8,262.94 కోట్లను ఆర్జించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలో సమావేశం కానున్నది. జీఎస్టీ సంస్కరణలు దీపావళి బహుమతి అంటూ స్వాతంత్య్రోత్సవ ప్రసంగంలో ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ప్రకటించిన విషయం విదితమే. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చతుర్వేది అధ్యక్షతన పరిహార సెస్‌పై జీఓఎం సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఇక జీఎస్టీ రేటు హేతుబద్దతపై ఆరుగురు సభ్యుల జీఓఎం సమావేశం సామ్రాట్ చౌదరీ అధ్యక్షతన గురువారం జరగనున్నది. ఇందులో కేంద్రం ప్రతిపా దించిన పన్ను శ్లాబుల గురించి చర్చించనున్నారు. ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం జీఎస్టీ సంస్కరణలకు కేంద్రం చేసిన ప్రతిపాదనతో ప్రభుత్వ ఎక్స్‌చెకర్‌కు ఏడాదికి రూ.85వేల కోట్ల భారం పడనున్నది.
సంస్కరణలు ఆత్మనిర్భర్ ప్రయాణానికి నాంది : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
జీఓఎం సమావేశానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు భారతదేశం ఆత్మనిర్భర్ భారత్‌గా మారే ప్రయాణానికి నాంది పలుకుతాయని అన్నారు. ఈ సంస్కరణలు నిర్మాణాత్మక సంస్కరణలు, రేటు హేతుబద్ధీకరణ, జీవన సౌలభ్యం వంటి మూడు కీలక స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకే దక్కాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES