– అంగన్వాడీ నూతన భవనాలకు ఉచిత ఇసుక
– వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో సదుపాయాలను మెరుగుపరుస్తాం : మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు త్వరలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్‌ను రాష్ట్రమంతటా ప్రారంభిస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) ప్రకటించారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో 139 కేంద్రాల్లో ఆ పథకాన్ని అమలు చేయగా అక్కడ 30 శాతం పిల్లలు అదనంగా పెరిగారని చెప్పారు. అంగన్వాడీ నూతన భవనాల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని హామీనిచ్చారు. హైదరాబాద్‌లోని ఎర్ర మంజిల్‌లో గల మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, జాయింట్ డైరెక్టర్లు, రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు. మంజూరైన 1025 అంగన్వాడీ భవనాలలో ఇప్పటివరకు 625 ప్రాంతాల్లోనే స్థలాలు గుర్తించారనీ, మిగిలిన ప్రాంతాల్లో స్థల గుర్తింపు తక్షణం పూర్తిచేయాలని ఆదేశించారు.
పనుల జాతరలో నూతన భవనాలను శంకుస్థాపనలు చేయించాలనీ, పూర్తయిన 22 అంగన్వాడీ కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యేల చేత ప్రారంభించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల యూనిఫాం చీరల తయారీ పూర్తయి జిల్లా కేంద్రాలకు చేరాయనీ, వాటిని తక్షణమే పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి చిన్నారికి ఉదయం 100 మిల్లీలీటర్ల పాలు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామనీ, ప్రతి వారం ఒక రోజు ఎగ్ బిర్యానీ, ఒక రోజు వెజిటేబుల్ కిచిడి వడ్డించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు కూర్చునేలా పంపిణీ చేస్తున్న లాంగ్ టేబుల్స్ ఎత్తు పెంచాలని డిమాండ్ మేరకు మార్పులు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం తమ శాఖ పరిధిలో తొమ్మిది వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ సేవలందిస్తున్నాయనీ, మరో ఐదు హాస్టల్స్ నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా పోషకాహారం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క సిబ్బందిని అభినందించారు.
చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES