Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగర్భిణి మృతి కేసులో ఏడుగురు అరెస్ట్‌

గర్భిణి మృతి కేసులో ఏడుగురు అరెస్ట్‌

- Advertisement -

– వివరాలు వెల్లడించిన డీఎస్పీ

నవతెలంగాణ – సూర్యాపేట
లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించడంతో పాటు అక్రమంగా అబార్షన్‌ చేసి గర్భిణి మృతికి కారణమైన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతురాలి భర్త సహా లింగనిర్ధారణ పరీక్ష చేసినవారు, అక్రమంగా అబార్షన్‌ చేసిన ఇద్దరు ఆర్‌ఎంపీలు, స్కానింగ్‌ నిర్వహించిన వారితోపాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.
తుంగతుర్తి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు 108/25 ప్రకారం.. మద్దిరాల మండలం, గోరంట్ల గ్రామానికి చెందిన విజిత(మృతురాలు) మూడోసారి గర్భం దాల్చింది. మళ్లీ ఆడ బిడ్డే పుడుతుందేమోనని ఆమె భర్త బయగల శ్రీను ఆమెకు ఐదో నెలలో ఖమ్మం పట్టణంలోని ప్రయివేట్‌ క్లినిక్‌లో లింగ నిర్ధారణ పరీక్ష చేయించాడు. కడుపులో ఆడ శిశువు ఉన్నట్టు చెప్పడంతో తుంగతుర్తి సాయిబాలాజీ ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించాడు. అయితే, తీవ్ర రక్తస్రావం కారణంగా విజిత పరిస్థితి విషమించింది. ఖమ్మం తరలిస్తుండగా మృతిచెందింది.
తుంగతుర్తి సీఐ నరసింహారావు నేతృత్వంలో పోలీసులు విచారణ జరపగా.. మృతురాలి భర్త తప్పుడు ఫిర్యాదు చేసినట్టు.. వాస్తవానికి అబార్షన్‌ సమయంలోనే విజిత మృతిచెందినట్టు బయటపడింది. దాంతో అబార్షన్‌ చేసిన ఆర్‌ఎంపీ బండి శ్రీనివాస్‌, సహకరించిన పానుగంటి సతీష్‌, లింగనిర్ధారణ పరీక్ష నిర్వహించిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ సంపేట అశోక్‌, పరికరం సమకూర్చిన పులి వీరభద్రరావు, ఏర్పాట్లు చేసిన నర్సు తుమ్మచర్ల అరుణ, కల్పన క్లినిక్‌ నిర్వాహకురాలు పోలంపల్లి కల్పన, మృతురాలి భర్త బయగల శ్రీనుపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ముందస్తు లింగనిర్ధారణ పరీక్షలు, అనర్హులు వైద్యం చేయడం చట్టపరమైన నేరమని డీఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడిన ఆస్పత్రులు, మెడికల్‌ షాపులను సీజ్‌ చేస్తామని, సహకరించిన వారిని కూడా శిక్షార్హులుగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad