నిందితుడికి జీవిత ఖైదు, రూ.55వేల జరిమానా
– బాధితులకు రూ.5లక్షలు చెల్లించాలని ఆదేశం
– ఏసీపీ శ్రీధర్‌రెడ్డి కృషితో సత్వర న్యాయం
నవతెలంగాణ – సిటీబ్యూరో
బాలికపై లైంగిక దాడి కేసులో ఎల్బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదు, రూ.55వేల జరిమానాతోపాటు బాధితులకు రూ.5లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ 9 ఏండ్ల బాలికకు ఆటోడ్రైవర్ షేక్‌సలీం(30) మాయమాటలు చెప్పి లైంగికదాడికి ఒడిగట్టాడు. 2022, జూన్ 10న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రాచకొండ సీపీ ఆదేశాలతో అప్పటి ఏసీపీ పి.శ్రీధర్‌రెడ్డి (ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు) కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బాలికపై మూడ్రోజులు అఘాయిత్యం చేసినట్టు విచారణలో తేల్చారు. ఓ మహిళా అధికారి సమక్షంలో బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. సాక్ష్యాలను సేకరించి ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కోర్టు అనుమతితో డీఎన్‌ఏ పరీక్షలు చేయించారు. పక్కాగా సాక్ష్యాలు సేకరించి 60రోజుల్లోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి అన్నికోణాలో విచారించిన ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ జడ్జి బుధవారం తీర్పు వెలువరించారు. ఫోక్సో చట్టంతోపాటు ఎస్సీ,ఎస్టీ చట్టం ప్రకారం నిందితుడికి జీవిత ఖైదు విధించారు. బాధితులకు న్యాయం జరగడంలో ఏసీపీ పి.శ్రీధర్‌రెడ్డి చేసిన కృషి ఎంతో ఉందని రాచకొండ సీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇందుకు సహకరించిన పీపీ బి.సునీత, డి.రఘు, శోభారాణితోపాటు పలువురిని సీపీ అభినందించారు.