అవే మాకు జీవనాధారం
– మూడు పంటలు పండే భూములు గుంజుకుంటే ఎలా?
– బలవంతపు భూసేకరణ జరిపితే న్యాయ పోరాటానికి సిద్ధం
– మళ్లీ నిమ్జ్ భూసేకరణపై రైతుల ఆవేదన
నవతెలంగాణ – ఝరాసంగం
పారిశ్రామిక రంగం విస్తరణలో భాగంగా నిమ్జ్ పేరుతో భూములు తీసుకుని రెండు సంవత్సరాలు తిరగకముందే మళ్లీ భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఉన్న కొద్దిపాటి భూములనూ సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.. జీవం పోస్తున్న ఆ కొద్ది భూములను తీసుకుంటే తాము బతికేదెట్టా? అని రైతులు లబోదిబోమంటున్నారు. ఆ ప్రాంతాలను ‘నవతెలంగాణ’ సందర్శించినప్పుడు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
దేశవ్యాప్తంగా స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్)లను ఏర్పాటు చేసి దేశీయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన నూతన విధానమే నిమ్జ్ (జాతీయ పెట్టుబడుల ఉత్పాదకమండలి). సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటుకు 12630 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూములను సేకరించాలని గత ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటి వరకు రెండు మండలాల్లో కలిపి సుమారు 7000 ఎకరాల భూమి సేకరించింది. ఉన్న కొద్ది భూమితో బతుకుతున్న దశలో రెండు సంవత్సరాలు తిరగకముందే మళ్లీ భూసేకరణ పేరుతో ఆ భూమిని కూడా గుంజుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్గోయి గ్రామంలో సాగు యోగ్యత కలిగిన భూమి 2544 ఎకరాలు ఉండగా.. 1002 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు. ఇప్పటి వరకు పట్టా, ప్రభుత్వ భూములు 2000 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పటి వరకు రైతులు నిమ్జ్ ప్రాజెక్ట్ కోసం భూములు స్వచ్ఛందంగానే ఇచ్చారు. కానీ మళ్లీ భూసేకరణకు రంగం సిద్ధమవ్వడంతో ఆందోళన చెందుతున్నారు.
మూడు పంటలు పండే భూములు..
ఉన్న కొద్దిపాటి భూముల్లో ప్రతి ఏడాదీ మూడు పంటలు పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఈ భూములు సైతం ప్రాజెక్ట్ పేరుతో తీసుకుంటే ఎలా అని ఎల్గోయి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నిమ్జ్ డీపీఆర్‌లో గతంలోనే మరో 571 ఎకరాల భూసేకరణకు ఏర్పాటు చేయగా.. విషయం తెలిసిన వెంటనే రైతులు అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని కలిసి మూడు పంటలు పండే ఈ భూములు తీసుకోవద్దని వేడుకున్నారు. ప్రస్తుతం అందులోనే మరో 195.13 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. బలవంతపు భూసేకరణ జరిపితే న్యాయ పోరాటానికి సిద్ధమని రైతులు స్పష్టం చేస్తున్నారు.
అస్థిత్వమే కోల్పోయే ప్రమాదం
నిమ్జ్ ప్రాజెక్టు పేరుతో గ్రామంలో మొత్తం భూమిని సేకరిస్తే గ్రామం అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అది ఊహించుకుంటేనే భయమేస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
బలవంతపు భూసేకరణ చేయొద్దు..
బలవంతపు భూసేకరణ ఆపాలి. లేనిపక్షంలో ఎల్గోయి రైతుల తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 2000 ఎకరాల భూమిని సేకరించారు. అందులోనే కొందరికి ఇంకా పరిహారం ఇవ్వలేదు. వారందరికీ వెంటనే పరిహారం చెల్లించాలి. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వమూ వ్యవహరిస్తోంది. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు భూములు కోల్పోయారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న కూలీలకు ఇప్పటి వరకు పరిహారం అందించలేదు. పునరావాసం కల్పించలేదు.
– రాంచందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
మూడు పంటలు పండే భూములు
సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను మేము వదులుకోం. అల్లం, పసుపు, చెరుకు, బొప్పాయి పంటలతో పాటు అంతర్ పంటగా టమాట, బెండకాయ, చిక్కుడు బీన్స్ వంటి కూరగాయలను సాగు చేస్తున్నాం. 2018లో ఇదే ప్రాజెక్టుకు 5 ఎకరాల భూమిని తీసుకున్నారు.
– యూనుసొద్దిన్
పూలు పండించి కుటుంబాన్ని పోషిస్తున్న
ఎకరా భూమిలో లిల్లీ పూలు సాగు చేసి జహీరాబాద్ పట్టణంలో అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. నిమ్జ్ ప్రాజెక్టు కింద నా భూమిని సేకరిస్తామని నోటిఫికేషన్ ఇచ్చారు. భూమిని కూల్పోతే మా కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి. గతంలోనే మూడెకరాల భూమిని ప్రభుత్వం తీసేసుకుంది. మళ్లీ ఈ మిగిలిన భూమి తీసుకుంటే మా పిల్లల భవిష్యత్ ఏమిటి?
– రైతు ఖైరాత్ అలి, ఎల్గోయి
నోటీఫికేషన్‌ను రద్దు చేయాలి
పరిశ్రమలు పెడతామని గతంలోనే 1.30 ఎకరాలను తీసుకుంది. అక్కడ ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పలేదు. రెండు సంవత్సరాలు తిరగకముందే మళ్లీ నోటిఫికేషన్ వేసి భూసేకరణ చేపడతామని చెబుతున్నారు. బలవంతంగా భూమిని సేకరిస్తే మేమంతా రోడ్డున పడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి.
– టి.వెంకటేశం
చెరుకు పంట సాగు చేస్తున్నాం..
రెండెకరాల్లో చెరుకు పంట సాగు చేస్తున్నాం. బ్యాంకులో పంట రుణం తీసుకుని నాలుగు బర్రెలు కొనుక్కున్నాం. అంతర్ పంటలుగా వంకాయ, టమాట, బెండ వంటి కూరగాయలు వేస్తున్నాం. ఇలాంటి భూములను కోల్పోతే ఎట్టా బతకాలి? ప్రభుత్వమిచ్చే రూ.15 లక్షలతో మా గ్రామంలోనే ఒక ప్లాట్ కూడా రావడం లేదు.
– మొల్ల అమీదా
ఈ భూములు పోతే ఆత్మహత్యలే..
ఉన్న కొద్ది భూమిలో ఆలుగడ్డ, అల్లం, పసుపు వంటి పంటలను సాగు చేస్తూ బతుకుతున్నాము. ముందుగాల్నే పరిశ్రమల పేరుతో ఎకరా భూమిని తీసుకున్నారు. మళీ ఉన్న 0.20 ఎకరం భూమిని సైతం తీసుకుంటే ఎలా జీవించేది. భూమిని కోల్పోతే మాకు ఆత్మహత్యే దిక్కు.
– టి.నర్సింలు