నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశం మందిరంలో శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్, డిసిపి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. మిలాద్-ఉన్-నబీ, గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో మతసామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామని అన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ట్రాన్స్ కో ఇరిగేషన్, ఆర్ అండ్ బి పంచాయతీ రాజ్, మత్స్యశాఖ ఫైర్, మున్సిపాలిటీ,గ్రామపంచాయతీ అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. గణేష్ ఉత్సవాలను కనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలోసహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని తో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని అన్నారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ వేడుక వెంటవెంటనే వస్తున్నందున భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మండపాల వద్ద సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.నిర్వాహకులు కూడా గణేష్ మండపాల వద్ద ఎవరికి వారు సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు.మంటపాల వద్ద నిర్వాహకులు రాత్రి వేళల్లో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా సహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో శోభాయమానంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని, వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రతి మండపం వద్ద పోలీసులను నియమిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, ఏసీపీ రాహుల్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేష్ చిస్తీ, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి వివిధ శాఖల అధికారులు, గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.