-ఎట్టకేలకు ముగిసిన బిఎఫ్‌ఐ ఎన్నికలు
న్యూఢిల్లీ : భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా అజయ్ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన బిఎఫ్‌ఐ ఎన్నికల్లో 33 రాష్ట్ర సంఘాల ప్రతినిధులు 66 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజయ్ సింగ్ 40 ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి ప్రదాన్ 26 ఓట్లు దక్కించుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ (ఉత్తరప్రదేశ్), కోశాధికారిగా భాస్కరన్ (తమిళనాడు) ఎన్నికయ్యారు. వరల్డ్ బాక్సింగ్ (డబ్ల్యూబీ), భారత క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నుంచి ఈ ఎన్నికలకు పరిశీలకులు హాజరు కాలేదు. ఈ ఏడాది మార్చి 28న జరగాల్సిన బిఎఫ్‌ఐ ఎన్నికలు న్యాయపరమైన చిక్కులతో వాయిదా పడుతూ వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగల్ ఇచ్చినా.. ఈ కేసులో తుది తీర్పుకు ఈ ఎన్నికలు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్ర క్రీడాశాఖ మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ బిఎఫ్‌ఐ అధ్యక్ష రేసులో నిలిచినా.. హిమాచల్ బాక్సింగ్ సంఘంలో ఠాకూర్ ఎన్నికైన సభ్యుడు కానందున.. అతడి పేరును ఎలక్ట్రోరల్ కాలేజ్‌లో చేర్చలేదు.